వాయిదాల సినిమాలకు కొత్త రిలీజ్ డేట్లు

వాయిదాల సినిమాలకు కొత్త రిలీజ్ డేట్లు

వాయిదాల మీద వాయిదాలు పడుతున్న రెండు తెలుగు సినిమాలకు కొత్త రిలీజ్ డేట్లు ఇచ్చారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ‘ఆక్సిజన్’ గురించి. ఈ సినిమా రెండేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుంది. గత ఏడాదే రావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడి ఆగస్టు 18న విడుదలకు సిద్ధమైంది. కానీ ఆ తేదీకి సినిమాను విడుదల చేయలేకపోయారు. తర్వాత అక్టోబరు 13 అన్నారు. ఆ డేటూ దాటిపోయింది. చివరికి అక్టోబరు 27న పక్కా అన్నారు. ఆ తేదీ కూడా దగ్గరపడింది. వచ్చే వారం కూడా సినిమా రిలీజ్  కాదని తేలిపోయింది. ఇంతలో చిత్ర బృందం కొత్త రిలీజ్ డేట్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం నవంబరు 10న ఈ చిత్రం విడుదలవుతుందట.

మరోవైపు ఆగస్టు 11.. సెప్టెంబరు 1 అంటూ రెండు డేట్లు ప్రకటించి.. ఆ తర్వాత వెనక్కి తగ్గిన ‘జవాన్’ కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తారట. దర్శక నిర్మాతలు అఫీషియల్‌గా ఈ రోజు రిలీజ్ డేట్ ప్రకటించారు. ఎప్పుడో పూర్తయిందన్న ఈ సినిమాను నవంబర్లో డేట్లు ఖాళీ ఉన్నప్పటికీ డిసెంబరుకు తీసుకెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఔట్ పుట్ పట్ల సమర్పకుడు దిల్ రాజు సంతృప్తిగా లేకపోవడం వల్ల, రీషూట్లు చేయడం వల్లే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడ్డట్లు వార్తలొచ్చాయి. బి.వి.ఎస్.రవి రూపొందించిన ఈ చిత్రం సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా నటించారు. కృష్ణ అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. మరి ఈ రెండు వాయిదాల సినిమాలు కొత్త రిలీజ్ డేట్లలో అయినా పక్కాగా విడుదలవుతాయో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు