ఆ సినిమాపై డాక్టర్లు గట్టిగా పగబట్టేశారే..

ఆ సినిమాపై డాక్టర్లు గట్టిగా పగబట్టేశారే..

తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా ‘మెర్శల్’ దీపావళి కానుకగా విడుదలై అదిరిపోయే ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తోంది. ఐతే ఈ సినిమాను లేని పోని వివాదాలు చుట్టుముడుతున్నాయి. మామూలుగా కొత్త సినిమాలకు వివాదాలు మేలే చేస్తుంటాయి కానీ.. ఈ సినిమాకు అవి చాలానే చేటు చేసేలా కూడా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్ మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ మీద సెటైర్లు పేల్చడం వివాదాస్పదమైంది. అది భారతీయ జనతా పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. వాళ్లు విజయ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో సినిమా నుంచి ఆ డైలాగుల్ని తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది.

మరోవైపు ఈ చిత్రంలో విజయ్ కార్పొరేట్ హాస్పిటళ్ల మీద.. వైద్యుల మీద కూడా సెటైర్లు వేశాడు. వాళ్లకు డబ్బే ముఖ్యమని.. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదని అన్నాడు. ఈ డైలాగులు వైద్యులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. వాళ్లు విజయ్ మీద విమర్శల్లాంటివేమీ చేయలేదు. అలా చేస్తే పబ్లిసిటీకి పనికొస్తుందని భావించి.. ‘మెర్శల్’ సినిమాకు వ్యతిరేకంగా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మెర్శల్ పైరసీ ప్రింటును తమిళనాడు వైద్యులు ఆన్ లైన్లో, మొబైళ్లలో సర్క్యులేట్ చేయడంలో బిజీగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

తమిళనాడులో మామూలుగానే పైరసీ దారుణంగా ఉంటుంది. ఇక ఇలా ఒక వర్గం పనిగట్టుకుని పైరసీని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తే జరిగే డ్యామేజ్ ఎలా ఉంటుందో చెప్పేదేముంది? మరోవైపు తమిళనాడు వ్యాప్తంగా వైద్యుల సంఘాలన్నింటినీ సంప్రదించి.. ఈ చిత్ర బృందంపై లీగల్ చర్యలు చేపట్టాలని కూడా వైద్యులు భావిస్తున్నారు. మరోవైపు ‘మెర్శల్’ సినిమాలో వైద్యుల్ని చిత్రీకరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అఖిల భారత వైద్యుల సంఘం ప్రకటన కూడా ఇచ్చింది. గతంలో తెలుగులో ‘గణేష్’ అనే సినిమా వచ్చినపుడు ప్రభుత్వ వైద్యులు సీరియస్‌గా స్పందించారు. దాని తర్వాత డాక్టర్లు ఇంత సీరియస్‌గా ఓ సినిమా మీద ఆగ్రహంగా కనిపించడం ఇదే అని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English