దిల్ రాజు కాదంటే వాళ్లు రెడీ..

దిల్ రాజు కాదంటే వాళ్లు రెడీ..

స్టార్లతో సినిమా తీసినా బడ్జెట్ విషయంలో చాలా పక్కాగా ఉంటాడు దిల్ రాజు. హద్దులు దాటి ఖర్చు పెట్టడానికి ఆయన అంగీకరించరు. అలాంటివాడు శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్లో రూ.200 కోట్ల బడ్జెుట్లో ‘భారతీయుడు-2’ చేయబోతున్నాడని వార్తలు వచ్చినపుడు జనాలకు నమ్మకం కలగలేదు. కానీ విజయ దశమి సందర్భంగా శంకర్-రజినీలను కలిసి ఈ ప్రాజెక్టును కన్ఫమ్ చేశాడు రాజు.

కానీ ఇప్పుడేమో ఈ సినిమా నుంచి దిల్ రాజు తప్పుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘భారతీయుడు’ నిర్మాత ఎ.ఎం.రత్నం ‘భారతీయుడు-2’కు సంబంధించి రాయల్టీ అడగడం.. బడ్జెట్ కూడా మరీ ఎక్కువ కావడంతో రాజు వెనక్కి తగ్గుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఐతే శంకర్-కమల్ ఈ సినిమా విషయంలో దిల్ రాజును మరీ సీరియస్‌గా తీసుకోవట్లేదని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దిల్ రాజు వెనక్కి తగ్గితే ఆల్టర్నేట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారట. శంకర్‌తో ‘2.0’ సినిమాను రూ.450 కోట్ల ఖర్చుతో తీస్తున్న లైకా ప్రొడక్షన్స్ వాళ్లు ‘భారతీయుడు-2’ను కూడా ప్రొడ్యూస్ చేయడానికి తాము సిద్ధమని చెప్పారట.

దీంతో దిల్ రాజు ఏమంటాడా అని శంకర్, కమల్ ఎదురు చూస్తున్నారట. ఆయన చేస్తానంటే సరే.. లేకపోతే లైకా వాళ్లకే సినిమాను ఇచ్చేద్దామని చూస్తున్నారట. మరి దిల్ రాజు ఈ ఈ సినిమా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి. ఎ.ఎం.రత్నంకు రాయల్టీ ఇవ్వడమే రాజుకు ఇబ్బంది కలిగిస్తున్న విషయం అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు