నరేషూ.. వేరే రూట్లోకి రావా??

నరేషూ.. వేరే రూట్లోకి రావా??

రూటు మారిస్తేనే హిట్టు వస్తుందని ఈ మధ్యన చాలామంది హీరోలు దగ్గరుండి మరీ ప్రూవ్ చేస్తున్నారు. మూస సినిమాలు మానేసి కొత్తవి ప్రయత్నిస్తేనే ఎన్టీఆర్ కు హిట్స్ వచ్చాయి. అలాగే రొటీన్ హీరో రోల్స్ వదిలేసి విలనీ చేస్తేనే జగపతి బాబు నిలదొక్కుకున్నాడు. ఇవన్నీ చూసినా కూడా.. ఇప్పుడు అల్లరి నరేష్‌ రియలైజ్ కావట్లేదా అనిపిస్తోంది.

నిజానికి నరేష్‌ సినిమాల్లోకి వచ్చి ఊరమాస్ కామెడీ చేస్తున్నప్పుడు.. అతని సినిమాలే ఆనందించడానికి దిక్కు అనేలా ఉండేవి. ఇప్పుడు మాత్రం జబర్ దస్త్ నుండి చాలా ఇతర ప్రోగ్రామ్స్ వరకు.. అన్నీ సినిమాలకంటే పీక్ స్థాయిలో కామెడీని అందించేస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా నరేష్‌ స్పూఫ్‌ లు చేస్తే చూడట్లేదు ఆడియన్స్. గతంలో నరేష్‌ సినిమాలో ఈసారి ఎవరిపై స్పూఫ్‌ అని చూసేవారు కాని.. ఇప్పుడు మాత్రం ఏదన్నా కొత్త సినిమా లేదా కొత్త ట్రైలర్ వస్తే.. వారం రోజుల్లో యుట్యూబ్ లో చాలామంది అలాంటివి చేసి పెట్టేస్తున్నారు. అందుకే నరేష్‌ రూటు మార్చి దేన్నా కొత్త తరహా సినిమాలు ప్రయత్నిస్తే బాగుంటుంది.

ఈ కథాకమామిషూ అంతా ఇప్పుడు ఎందుకు అంటే.. లేటెస్టుగా వచ్చిన మేడ మీద అబ్బాయి సినిమాతో మరోసారి ఫ్లాపునే తన జేబులో వేసుకున్నాడు. అయితే ఇప్పుడు తన అంకుల్ ఇ.సత్తిబాబు డైరక్షన్లో మరో కామెడీ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. గతంలో ఈయన నరేష్‌ తో యముడికి మొగుడు, బెట్టింగ్ బంగార్రాజు, జంప్ జిలానీ వంటి కామెడీ సినిమాలను తీశాడులే. మళ్లీ కామెడీ సినిమానే అంటంటే.. ఏం నరేషూ రూటు మార్చవా అనే అడగాలని అనిపిస్తోంది. మరి కామెడీలోనే ఏదన్నా కొత్త రూట్లో వెళ్తారేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు