ఫ్లాప్ సినిమానే కెరీర్ బెస్ట్ అని చెప్పింది

ఫ్లాప్ సినిమానే కెరీర్ బెస్ట్ అని చెప్పింది

దశాబ్దం పైగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. ఈ కాలంలో ఆమె 30 సినిమాలకు పైగా నటించింది. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. సూపర్ హిట్లూ ఉన్నాయి. కానీ మీ కెరీర్లో బెస్ట్ మూవీ ఏది అంటే మాత్రం ఒక ఫ్లాప్ సినిమా పేరు చెప్పింది కాజల్. ఆ సినిమా మరేదో కాదు.. అజిత్ సరసన కాజల్ నటించిన ‘వివేగం’.

ఈ చిత్రం రెండు నెలల కిందటే విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వసూళ్లు బాగానే వచ్చినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే అది ఫెయిల్యూర్ మూవీనే. పోనీ ఇదేమైనా కళాఖండమా అంటే అదీ కాదు. కాజల్ పాత్ర కూడా అంత గొప్పగా ఏమీ ఉండదు. అయినా తన కెరీర్లో ది బెస్ట్ ఫిలిం ఇదే అని తేల్చింది కాజల్.

ఇది కాకుండా తన కెరీర్లో ఇంకో నాలుగు బెస్ట్ మూవీస్ గురించి కూడా కాజల్ చెప్పింది. రానాతో కలిసి నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’.. బాలీవుడ్లో రణ్‌దీప్ హుడా సరసన చేసిన ‘దో లఫ్జోంకీ కహానీ’.. ఎన్టీఆర్ మూవీ ‘బాద్ షా’.. ప్రభాస్ సరసన నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తన ఫేవరెట్ మూవీ అని చెప్పింది కాజల్. ఇక వరల్డ్ సినిమాలో తనకు నచ్చిన సినిమాల పేర్లు కూడా కాజల్ వెల్లడించింది.

‘బిఫోర్ సన్‌రైజ్’, ‘శ్వషాంక్ రిడెంప్షన్’.. ‘సెంట్ ఆఫ్ ఎ ఉమన్’ తనకు చాలా ఇష్టమంది. ఇక ఇండియన్ సినిమాల్లో మణిరత్నం క్లాసిక్ ‘మౌనరాగం’తో పాటు నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘మన్మథుడు’ కూడా తనకు చాలా ఇష్టమని కాజల్ అగర్వాల్ వెల్లడించడం విశేషం.