అమీర్ ఖాన్ మళ్లీ కొట్టేశాడా..

అమీర్ ఖాన్ మళ్లీ కొట్టేశాడా..

అమీర్ ఖాన్ సినిమా అంటే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోవచ్చు అన్న భరోసా వచ్చేసింది ప్రేక్షకులకు. గత రెండు దశాబ్దాల్లో అమీర్ నుంచి అంత మంచి సినిమాలొచ్చాయి మరి. లగాన్.. దిల్ చాహ్‌తా హై.. రంగ్ దె బసంతి.. తారే జమీన్ పర్.. 3 ఇడియట్స్.. పీకే.. దంగల్.. ఇలా వేటికవే అద్భుతమైన సినిమాలు. ఈ సినిమాలతో అమీర్ ఇమేజ్ ఆకాశానికి చేరిపోయింది.

అమీర్ నటిస్తూ నిర్మించిన కొత్త సినిమా ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సైతం తన స్థాయికి తగ్గట్లే ఉందని అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఈ నెల 19న దీపావళి కానుకగా ‘సీక్రెట్ సూపర్ స్టార్’ విడుదలవుతున్న నేపథ్యంలో రెండు రోజుల ముందే ముంబయిలో బాలీవుడ్ సెలబ్రెటీలకు ప్రివ్యూ వేశారు. అది చూసిన వాళ్లందరూ అమీర్ అండ్ టీంను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి ఈ ఏడాది బాలీవుడ్లో వచ్చిన బెస్ట్ మూవీ ‘సీక్రెట్ సూపర్ స్టార్’ అని తేల్చేశాడు.

ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఆల్రెడీ ‘సీక్రెట్ సూపర్ స్టార్’ను తెగ పొగిడేస్తూ.. 4 స్టార్ రేటింగ్‌తో రివ్యూ కూడా ఇచ్చేశాడు. ఇది అద్భుతమైన సినిమా అని తేల్చేశాడు. ఇంకా బాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు. ఇందులో లీడ్ రోల్ చేసిన ‘దంగల్’ ఫేమ్ జైరాను అందరూ పొగిడేస్తున్నారు.

అమీర్ దగ్గర మేనేజర్ గా పని చేసిన అద్వైత్ చౌహాన్ దర్శకుడిగా మారి ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమాను రూపొందించాడు. సంగీతం అంటే పడి చచ్చే ఓ అమ్మాయి తన ఇంట్లో ప్రోత్సాహం అందని సమయంలో అజ్నాత వ్యక్తిలా యూట్యూబ్‌లో కనిపిస్తూ తన ప్రతిభను చాటుకునే నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు