నేను, త్రివిక్రమ్.. సేమ్ టు సేమ్

నేను, త్రివిక్రమ్.. సేమ్ టు సేమ్

త్రివిక్రమ్‌ను టాలీవుడ్లో చాలామంది గురూజీ అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. అభిమానులు సైతం ఆయన్ని ఆ పిలుపుతో సంబోధిస్తుంటారు సోషల్ మీడియాలో. ఐతే తమిళ కుర్రాడైన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సైతం మాటల మాంత్రికుడిని అలాగే పిలుస్తాడట.

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు అనిరుధే సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంగీతం గురించి, త్రివిక్రమ్‌తో తన అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు చెప్పాడు అనిరుధ్.

‘‘త్రివిక్రమ్ గారితో నేను ఇంతకుముందే (అఆ) పని చేయాల్సింది. కానీ కుదర్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాంటి పెద్ద స్టార్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ గారు అందించిన సహకారాన్ని మరిచిపోలేను. నేను నా సహజ శైలిలో సంగీతం అందించడానికి ఆయన స్వేచ్ఛ ఇచ్చారు. నేను ప్రతి ట్యూన్ విషయంలోనూ ఇది ఇక్కడి ప్రేక్షకులకు నచ్చుతుందా అని సందేహించేవాడిని. కానీ త్రివిక్రమ్ గారు ఓకే చేసి ప్రోత్సహించారు. సంగీతం విషయంలో మా ఇద్దరి ఆలోచనలు చాలా దగ్గరగా ఉంటాయి. మేమిద్దరం ఒకేరకమైన సౌండ్లను, సంగీతాన్ని ఇష్టపడతాం. నేను ఏదైనా సందర్భం చెప్పగానే ఒక ట్యూన్ చేస్తా. ఆ తర్వాత వేరే ట్యూన్లు కూడా ఇస్తా. ఐతే తొలిసారి సందర్భం చెప్పినపుడు వెంటనే ఇచ్చే ట్యూన్ చాలా ఒరిజినల్‌గా ఉంటుంది. అప్పుడది గుండె లోతుల్లోంచి వస్తుంది. నాకు అదే నచ్చుతుంది. త్రివిక్రమ్ గారు కూడా సరిగ్గా అదే కావాలంటారు. ఈ రకంగా మా ఆలోచనలు సేమ్ టు సేమ్ ఉంటాయి. పవన్ గారి పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన బైటికెళ్లి చూస్తే.. పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ఆల్బంలో ఉన్న పాటలన్నీ ఇలాగే చాలా బాగుంటాయి. అన్ని రకాల పాటలూ ఇందులో ఉంటాయి’’ అని అనిరుధ్ చెప్పాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు