ఆ ఎన్టీఆర్ సినిమా పేలవం అంటున్న వర్మ

ఆ ఎన్టీఆర్ సినిమా పేలవం అంటున్న వర్మ

నందమూరి బాలకృష్ణ-తేజ కాంబినేషన్లో రాబోయే ఎన్టీఆర్ సినిమా ఏమాత్రం ఆసక్తికరంగా ఉండదని పరోక్షంగా తేల్చి చెప్పేశాడు రామ్ గోపాల్ వర్మ. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి తాను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపించబోయే అంశాలే అత్యంత ఆసక్తికరమైనవని వర్మ అభిప్రాయపడ్డాడు. అసలు తన సినిమాలో తానేమీ చూపించబోతున్నానో వర్మ ఓ ఇంటర్వ్యూలో వివరించి చెప్పాడు.

‘‘ఎన్టీఆర్ జీవిత చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే అది మహాభారతం లాగా అనిపించింది. అందులో చాలా ఎపిసోడ్లు ఉన్నాయి. వాటన్నింటినీ రెండు రెండున్నర గంటల సినిమాలో చూపించడం అసాధ్యం. నేను ఎన్టీఆర్ సినిమా తీస్తానని ప్రకటించినపుడు ఏం తీయాలన్న క్లారిటీ లేదు. ఐతే ఈ సినిమా కోసం పరిశోధనలో భాగంగా యూట్యూబ్ లో అనేక వీడియోలు చూశాను. చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. అప్పుడే నాకు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించాక చాలా ఆసక్తికరమైన మలుపులున్నాయని అనిపించింది.
ఎన్టీఆర్ బాల్యం.. ఆయన సినిమాల్లో ఎదగడం.. సూపర్ స్టార్ పొలిటీషియన్ కావడం.. ముఖ్యమంత్రిగా మారడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. పైగా ఇందులో ఏమాత్రం కాన్‌ఫ్లిక్ట్ అనేదే లేదు. ఎన్టీఆర్ ఏదో కష్టపడి ఎదిగినట్లు.. స్ట్రగులైనట్లు చూపిస్తే అది అబద్ధమే అవుతుంది. సినిమా కెరీర్ పరంగా అది చూపిస్తే దాన్ని జనాలు అసలు యాక్సెప్ట్ చేయరు. నాకు తెలిసి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏం చూపించినా అది పేలవంగా ఉంటుంది. కానీ లక్ష్మీపార్వతి రాకతో ఎన్టీఆర్ జీవితంలో అనేక పరిణామాలు జరిగాయి. ఒక సామాన్యుడి జీవితంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయో ఎన్టీఆర్ జీవితంలోనూ ఒక దశ దాటాక అలాంటి స్ట్రగులే ఉంది. దాన్ని నేను తెరమీద చూపించాలనుకుంటున్నా. ఇక్కడ నేను కథను లక్ష్మీపార్వతి కోణంలో చూపించను. అందుకోసం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్ పెట్టలేదు. ఆమె వచ్చాక జరిగిన పరిణామాలు చూపించబోతున్నా కాబట్టి ఆ టైటిల్ పెట్టాను’’ అని వర్మ స్పష్టత ఇచ్చాడు.