‘రాజా ది గ్రేట్’ రెడ్డి క్యారెక్టర్ స్పెషలంట

‘రాజా ది గ్రేట్’ రెడ్డి క్యారెక్టర్ స్పెషలంట

ఓవైపు ‘గీతాంజలి’.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’.. ‘ఆనందో బ్రహ్మ’ లాంటి సినిమాల్లో హీరోగా నటిస్తూ మంచి ఫలితాలు అందుకుంటూనే.. మరోవైపు కమెడియన్‌గానూ కొనసాగుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు శ్రీనివాసరెడ్డి. అతను కీలక పాత్ర చేసిన తాజా సినిమా ‘రాజా ది గ్రేట్’. ఇందులో హీరోతో పాటే ఉంటూ సినిమా అంతటా కనిపించే పాత్ర చేశాడు శ్రీనివాసరెడ్డి.

తన తొలి రెండు సినిమాలు ‘పటాస్’.. ‘సుప్రీమ్’ల్లోనూ కీలక పాత్రలతో నవ్వించిన శ్రీనివాసరెడ్డికి ‘రాజా ది గ్రేట్’ చాలా మంచి పేరు తెచ్చి పెడుతుందని అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో హీరోతో పాటే పూర్తి నిడివితో ఉండే ఈ క్యారెక్టర్ విషయంలో తనను హీరో రవితేజ క్వశ్చన్ చేసినట్లు అతను చెప్పాడు.

తన క్యారెక్టర్ తో సమానంగా శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్ ఉండటంలో లాజిక్ ఏంటో చెప్పమని అడిగితే.. ఆయన ప్రశ్నకు సమాధానంగా ఈ క్యారెక్టర్ కు ఒక చిన్న స్టోరీ పెట్టినట్లు చెప్పాడు అనిల్. సినిమాలో శ్రీనివాసరెడ్డి పాత్ర రవితేజ సీన్లోకి వచ్చిన ప్రతిసారీ అతడిపై పూలు చల్లి దేవుడిలాగా చూస్తుందని.. దీనిపై వేరే వ్యక్తి ప్రశ్నిస్తే.. "ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఓడియన్ థియేటర్ దగ్గర చింపిరి జుట్టుతో చీమిడి ముక్కుతో మూడేళ్ల పిల్లాడుంటే నువ్వు తీసుకెళ్లి పెంచుకుంటావా" అని శ్రీనివాస్ రెడ్డి అడుగుతాడని.. హీరో తనను అలా తీసుకెళ్లి పెంచి పోషించాడు కాబట్టి అతడు తనకు దేవుడని.. అందుకే అతణ్ని ఒక దేవుడిలా పూజిస్తానని శ్రీనివాసరెడ్డి చెబుతాడని.. ఇలా ఈ పాత్రకు జస్టిఫికేషన్ ఇచ్చామని తెలిపాడు అనిల్. శ్రీనివాసరెడ్డి కెరీర్లో ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్ అవుతుందని అనిల్ అభిప్రాయపడ్డాడు.