నాని ఇంకో సినిమా ఓకే చేశాడు

నాని ఇంకో సినిమా ఓకే చేశాడు

గత రెండేళ్లుగా నాని జోరు ఎలా సాగుతోందో తెలిసిందే. హిట్టు మీద హిట్టు కొడుతూ తన స్టేచర్ బాగా పెంచుకున్నాడు నాని. ఇప్పుడతను మీడియం రేంజ్ స్టార్ అనే చెప్పాలి. కన్సిస్టెంట్‌గా హిట్లు కొట్టడమే కాదు.. శరవేగంగా సినిమాలు పూర్తి చేస్తుండటం కూడా నాని ప్రత్యేకత. వేగం చూపిస్తూనే క్వాలిటీ కూడా మెయింటైన్ చేయడమంటే చిన్న విషయం కాదు. కొన్ని నెలల కిందటే ‘నిన్ను కోరి’తో మరో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న నాని.. ప్రస్తుతం ఒకటికి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ‘ఎంసీఏ’ చేస్తూనే.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’కు శ్రీకారం చుట్టాడు.

ఇప్పుడు నాని ఇంకో సినిమాను ఓకే చేశాడు. ‘నేను శైలజ’ సినిమాతో దర్శకుడిగా తనేంటో రుజువు చేసుకుని.. ఇప్పుడు ‘ఉన్నది ఒకటే జిందగీ’తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న యువ దర్శకుడు కిషోర్ తిరుమల నానితో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం జనవరిలో సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ టేకప్ చేస్తోంది. సెన్సిబుల్ లవ్ స్టోరీలు తీసే కిషోర్.. నానితో సినిమా చేయబోతున్నాడంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.

మరోవైపు నాని తన స్నేహితుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఐతే నానితో చేసేందుకు ముందు అనుకున్న కథను అవసరాల పక్కన పెట్టేశాడు. నాని రేంజ్ పెరిగిందని.. అందుకు తగ్గట్లు కొత్త కథ రాయాల్సి ఉందన్నాడు అవసరాల. అతను కథ రెడీ చేస్తే సాయి కొర్రపాటి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు