తెలుగు స్పీచ్ చితగ్గొట్టేసిందిగా..

తెలుగు స్పీచ్ చితగ్గొట్టేసిందిగా..

సిమ్రాన్, త్రిష, నయనతార లాంటి హీరోయిన్లు తెలుగులో చాలా ఏళ్ల పాటు సినిమాలు చేశారు. కానీ వాళ్లెవ్వరికీ కూడా ఒక్క ముక్క తెలుగు అబ్బలేదు. కానీ ఈ తరం హీరోయిన్ల రూటే వేరు. ఒకట్రెండు సినిమాలకే తెలుగు ఈజీగా వచ్చేస్తోంది. ఆడియో వేడుకల్లో ‘నమస్కారం.. బాగున్నారా’’ అంటూ ఒకట్రెండు ముక్కలు మొక్కుబడిగా తెలుగు మాట్లాడేసి వదిలేయట్లేదు ఇప్పటి కథానాయికలు.

ఇక్కడి అమ్మాయిల మాదిరి అలవోకగా తెలుగులో ప్రసంగించేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఛార్మి, సమంత, తమన్నా, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా.. ఇలా చాలామంది హీరోయిన్లు తెలుగులో దుమ్ముదులిపేసే వాళ్లే. ఈ కోవలోకే చేరిపోయింది అనుపమ పరమేశ్వరన్.

నిన్నటి ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఆడియో వేడుకలో అనుపమ స్పీచ్ చూసి జనాలకు పిచ్చెక్కిపోయింది. అంత అలవోకగా తెలుగులో ఐదు నిమిషాల పాటు అరదగొట్టేసింది అనుపమ. ‘ఉన్నది ఒకటే జిందగీ’ తన జీవిత ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన అనుభవమని.. ఇందులో తాను చేసిన మహా పాత్ర తనను వ్యక్తిగతంగా కూడా ఎంతో మార్చిందని.. ఆ పాత్రను ఎప్పటికీ మరిచిపోలేనని వ్యాఖ్యానించింది అనుపమ.

‘ఉన్నది ఒకటే జిందగీ’లో రామ్ ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయానని.. అలాంటి ఎనర్జీ ఎలా వస్తుందో అర్థం కాదని అంది అనుపమ. ‘నేను శైలజ’లో హీరోయిన్‌తో ‘ఐలవ్యూ.. బట్ ఐయామ్ నాట్ ఇన్ లవ్ విత్ యు’ అని చెప్పించిన దర్శకుడు కిషోర్.. ఇప్పుడు ‘ఉన్నది ఒకటే జిందగీ’లో కథానాయికతో ‘‘డోండ్ వర్రీ.. తొందరలోనే ఏడుస్తావు’’ అనిపించారని.. ఇలాంటి డైలాగ్స్ ఎలా రాయగలుగుతారో అని అనుపమ చెప్పింది. ఈ సినిమా డైలాగులు చదువుతున్నపుడు తాను చాలా రిలేట్ చేసుకున్నానని.. రేప్పొద్దున ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతారని అంది అనుపమ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు