రామ్ ఉంటే ఏమైనా రాసుకోవచ్చు

రామ్ ఉంటే ఏమైనా రాసుకోవచ్చు

ఇంతకుముందు తమిళంలో ఓ చిన్న సినిమా.. తెలుగులో ‘సెకండ్ హ్యాండ్’ అనే మరో సినిమా తీసిన దర్శకుడు కిషోర్ తిరుమల. ఐతే ఆ రెండు సినిమాలతో అతడికి పెద్దగా పేరేమీ రాలేదు. కానీ రామ్ హీరోగా తీసిన మూడో సినిమా ‘నేను శైలజ’ మాత్రం కిషోర్‌కు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇప్పుడు అదే హీరోతో ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా తీశాడు కిషోర్. ఈ సినిమా నెలాఖర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిన్న రిలీజైన ఈ చిత్ర ట్రైలర్.. ఆడియో రెండూ కూడా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తన హీరో రామ్ గురించి, స్రవంతి మూవీస్ బేనర్ గురించి మాట్లాడుతూ చాలా ఎగ్జైట్ అయిపోయాడు కిషోర్.

రామ్ లాంటి హీరో అందుబాటులో ఉంటే రచయితలు, దర్శకులు ఏమైనా రాసుకోవచ్చని అతనన్నాడు. ‘‘రచయితలు, దర్శకులు ఏమైనా రాసుకుంటాం. ఐతే ఏడాదో ఏడాదిన్నరో ఒక పాత్రతో ట్రావెల్ చేస్తాం కాబట్టి ఆ పాత్ర ఎలా ప్రవర్తిస్తుంది.. ఏం చేస్తుంది.. బాడీ లాంగ్వేజ్ అన్నింటి మీదా ఒక అవగాహన ఉంటుంది. కానీ నటీనటులు సినిమా మొదలవడానికి రెండు రోజుల ముందు క్యారెక్టర్ గురించి తెలుసుకుంటారు.

దాన్ని దర్శకులు కోరుకున్నట్లుగా పండిస్తారు. అందుకే నటీనటులు గొప్ప వాళ్లు. ఇక నా హీరో రామ్ ఉంటే.. మనం ఏమైనా రాసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది. ఏం రాసినా దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లగల ప్రతిభ అతడి సొంతం. ఇక నిర్మాత స్రవంతి రవికిషోర్ నన్నెంతగానో నమ్మారు. నా మీద పెట్టుకున్న నమ్మకం ‘నేను శైలజ’ అయితే.. ఆయన పెట్టుకున్న గట్టి నమ్మకం ‘ఉన్నది ఒకటే జిందగీ’’ అని కిషోర్ తిరుమల చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు