కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఎవరినీ అడగను

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఎవరినీ అడగను

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.. ఈ ప్రశ్నతో దాదాపు రెండేళ్ల పాటు వెర్రెత్తిపోయారు భారతీయ ప్రేక్షకులు. ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ 28న ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఐతే సినిమా చూసిన వాళ్లు.. చూడని వాళ్లు అందరూ ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకున్నారు కానీ.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాత్రం ఇంకా ఆ జవాబేంటో తెలుసుకోలేదట.

అలాగని ఆయన ‘బాహుబలి: ది బిగినింగ్’ చూడలేదనుకుంటే పొరబాటే. ఆయన ఆ సినిమా చూశాడట. కానీ ఇప్పటిదాకా రెండో భాగం చూడలేదట. కనీసం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న వేరే వాళ్లను అడిగి కూడా జవాబు తెలుసుకోలేదట. తన కొత్త సినిమా ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ వచ్చిన అమీర్ ఖాన్.. ‘బాహుబలి’ గురించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు. ఈ సందర్భంగా ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళిపై అమీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

‘‘రాజమౌళి బాహుబలి సినిమాను అద్భుతంగా తీశారు. గొప్ప కథకుడాయన. అందుకే భాషతో సంబంధం లేకుండా ‘బాహుబలి’ ఆదరణ పొందింది. ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. నేను ‘బాహుబలి: ది బిగినింగ్’ మాత్రమే చూశా. ఇంకా ‘బాహుబలి: ది కంక్లూజన్’ చూడలేదు.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో నాకు తెలియదు. ఈ విషయం గురించి ఎవరినీ అడగలేదు. అడగను కూడా. ఎందుకంటే నేను త్వరలోనే ‘బాహుబలి-2 చూడబోతున్నా. ‘బాహుబలి’గా ప్రభాస్ అద్భుతంగా నటించాడు’’ అని అమీర్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు