దీపావ‌ళిపై పేలుతున్న కోర్టుల తీర్పులు

దీపావ‌ళిపై పేలుతున్న కోర్టుల తీర్పులు

దేశంలో దీపావ‌ళి పండుగ‌ను చేసుకునేందుకు మ‌రో ఆర్రోజుల స‌మ‌యం ఉంది. అయితే, ఈ పండ‌గ‌కు ముందే ప‌లు కోర్టుల తీర్పుల ప‌టాకులు జోరుగా పేలుతున్నాయి. నాలుగు రోజుల కింద‌ట దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఎలాంటి ప‌టాకుల‌ను కాల్చేందుకు వీలు లేద‌ని సుప్రీకోర్టు ఆదేశిస్తూ.. భారీ ల‌క్ష్మీబాంబును పేల్చిన‌ విష‌యం తెలిసిందే. దీని ధాటికి సోష‌ల్ మీడియాలో మ‌రిన్ని ప‌టాకులు పేలిపోయాయి. మాట‌ల తూటాలైతే.. హ‌ద్దులు కూడా దాటిపోయాయి. సాక్షాత్తూ గ‌వ‌ర్న‌ర్ స్థాయి వారుకూడా ప‌రోక్షంగా మండిప‌డ్డారు. దీనిపై ఇంకా వివాదం ర‌గులుతూనే ఉంది. అటు సుప్రీం అయిపోవ‌డంతో ఎవ‌రికి వారు త‌మ త‌మ ప‌రిధులు, న్యాయ ప‌రిధులు చూసుకుని మాట‌ల ప‌టాకులు పేలుస్తున్నారు.

ఇంత వ‌ర‌కు ఇదొక క‌థ‌! అయితే, ఇప్ప‌డు పంజాబ్ హ‌ర్యానా రాష్ట్రాల హైకోర్టు కూడా దీపావ‌ళి పండుగ‌పై తీర్పు ప‌టాకులు పేల్చింది. సామాజిక ఉద్య‌మ కారులు, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు.. తాజాగా వెలువ‌రించిన తీర్పు దీపావ‌ళి ప్రియుల‌కు ఒకింత ఉప‌శ‌మ‌న‌మే చెప్పాలి. పటాకులు కాల్చేందుకు కాల పరిమితిని విధిస్తూ ఈ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీపావళి రోజు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు మాత్రమే కాల్చాలని ప్రజలకు సూచిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

 పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వ్యాన్లు అంతటా తిరుగుతూ పరిస్థితిని సమీక్షించాలని.. ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.  ఇక గతంలో ఢిల్లీలో ప‌టాకులే కాల్చ‌రాదంటూ.. ఇచ్చిన ఆదేశాలను సవరించాలని దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాణాసంచా వర్తకులు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారణకు చేపట్టిన కోర్టు.. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి సడలింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీపావళి తర్వాత పర్యావరణ కాలుష్య స్థాయిలను సమీక్షించి.. కావాలంటే అప్పుడు నిర్ణయం ప్రకటిస్తామని బెంచ్‌ తెలిపింది. దీనిపై సోషల్ మీడియాలో పలువురు భిన్న అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది దీపావ‌ళి క‌న్నా ముందే తీర్పుల ప‌టాకుల పేలుడు జోరందుకోవ‌డం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు