అవేమీ చూపించనంటున్న వర్మ

అవేమీ చూపించనంటున్న వర్మ

నందమూరి బాలకృష్ణ చేయబోయే ఎన్టీఆర్ బయోపిక్ ఎప్పుడు మొదలవుతుందో.. ఆ సినిమా ఎలా ఉంటుందో ఏమో కానీ.. ఈలోపు రామ్ గోపాల్ వర్మ చేయబోయే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ జనాల్లో బాగానే క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమాను ప్రకటించిన కొన్ని రోజులకే ప్రి లుక్ కూడా లాంచ్ చేసి సంచలనం సృష్టించాడు వర్మ. వచ్చే ఫిబ్రవరిలోనే సినిమా మొదలవుతుందని.. అక్టోబర్లో విడుదల చేసేస్తామని కూడా వర్మ ప్రకటించేశాడు. ఇంతకీ వర్మ ఈ సినిమాలో ఏం చూపిస్తాడన్న విషయంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఐతే ఈ విషయంలో వర్మ ముందే ఒక క్లారిటీ ఇచ్చేశాడు.

ఎన్టీఆర్ జీవితాన్ని పూర్తిగా తాను తెరమీదికి తీసుకురావట్లేదని చెప్పేశాడు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదని.. అందులో అనేక ఘట్టాలున్నాయని.. మొత్తం రెండున్నర గంటల్లో చూపించడం అసాధ్యమని అన్నాడు వర్మ. కాబట్టి అందరికీ తెలిసిన, మామూలు విషయాల జోలికి తాను వెళ్లనని అన్నాడు వర్మ. ఎన్టీఆర్ బాల్యం.. సినిమాల్లో ఆయన ఎదుగుదల రాజకీయ రంగ ప్రవేశం గురించి తాను చర్చించనన్నాడు.

లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాక.. ఆయన మరణించే వరకు జరిగిన పరిణామాల్నే తాను చూపిస్తానన్నాడు. అందుకే ఈ సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరు పెట్టినట్లు వర్మ వెల్లడించాడు. తాను పరిశోధించడం ద్వారా తెలిసిన.. అర్థం చేసుకున్న విషయాల్ని తన శైలిలో తెరకెక్కిస్తానన్నాడు.

ప్రతి విషయం మీద ఎవరి దృక్కోణం వారిదని.. ఏది సరైందనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదని.. ఐతే జరిగిన పరిణామాల్ని తన సోర్స్ ద్వారా తెలుసుకుని అర్థం చేసుకున్న మేరకు ఈ సినిమాలో చూపిస్తానని అన్నాడు వర్మ.