ఆడియో వేడుకట.. హీరో వస్తాడా?

ఆడియో వేడుకట.. హీరో వస్తాడా?

మూణ్నెల్ల కిందట గోపీచంద్ సినిమా ‘గౌతమ్ నంద’ విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్ల టైంలో గోపీచంద్‌ను ‘ఆక్సిజన్’ గురించి అడిగితే.. చాలా నిరాసక్తంగా బదులిచ్చాడు. ఆ సినిమాకు సంబంధించి తనకేమీ తెలియదన్నాడు. ఇంకా షూటింగ్ కొంత మిగిలి ఉందని.. అదెప్పుడవుతుందో.. సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియదన్నట్లు మాట్లాడాడు.

ఈ సినిమా కథ విషయంలో దర్శకుడు జ్యోతికృష్ణకు, గోపీచంద్‌కు విభేదాలు తలెత్తాయని.. అందుకే ఈ సినిమాను గోపీ మధ్యలో వదిలేశాడని.. రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఈ నెలాఖర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నెల 15న నెల్లూరులో ఆడియో వేడుక చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఐతే ఈ వేడుకకు అసలు గోపీచంద్ వస్తాడా రాడా అన్న సందేహాలు కలుగుతున్నాయిప్పుడు. చాన్నాళ్లు వార్తల్లో లేకుండా పోయిన ‘ఆక్సిజన్’.. ఈ మధ్యే మళ్లీ కొంత చర్చనీయాంశమవుతోంది. ఒకట్రెండు పాటలు ఆన్ లైన్లో రిలీజ్ చేశారు.

ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. కానీ ఏ సందర్భంలోనూ గోపీచంద్ నుంచి ఏ స్పందనా లేదు. తన సినిమా ఒకటి రిలీజ్‌కు రెడీ అవుతుంటే ఇలా హీరో సైలెంటుగా ఉండటం అరుదు. ‘సౌఖ్యం’ డిజాస్టరవడం.. ‘గౌతమ్ నంద’ కూడా ఫ్లాప్ కావడం.. ‘ఆరడుగుల బుల్లెట్’ అడ్రస్ లేకుండా పోవడంతో గోపీచంద్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. ‘ఆక్సిజన్’ ఔట్ పుట్ మీద కూడా అతనేమంత సంతృప్తిగా లేడని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అతను ఈ సినిమాతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోపీ ఆడియో వేడుకకు వస్తాడా.. వచ్చినా ఎలా ఉంటాడు.. ఏం మాట్లాడతాడు అన్న చర్చ నడుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు