రోజా ఆ పాత్ర చేస్తే అంతే సంగతులు..

రోజా ఆ పాత్ర చేస్తే అంతే సంగతులు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఒకప్పటి హీరోయిన్ రోజా.. రామ్ గోపాల్ వర్మ తీయబోయే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో లక్ష్మిపార్వతి పాత్ర చేయబోతున్నట్లుగా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం రోజాను అడిగేందుకు వర్మ ఆమె ఇంటికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. వర్మ కానీ, రోజా కానీ ఈ పాత్ర విషయంలో అధికారిక ప్రకటనే ఏదీ చేయలేదు. ఐతే రోజా ఈ పాత్ర చేస్తే పర్ఫెక్ట్‌గా ఉమటుందని, సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కొందరు అప్పుడే రోజాను లక్ష్మీపార్వతిగా ఊహించేసుకుంటున్నారు.

ఐతే రోజా లక్ష్మీపార్వతి పాత్ర చేయడమంటే పెద్ద సాహసమే అవుతుంది. రాజకీయంగా ఆమెకు అది చేటు చేస్తుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఈ పాత్ర చేసిందంటే ఇక ఎప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోక తప్పదు. లేదంటే మరేదైనా పార్టీ చూసుకోవాలి తప్ప.. తెలుగుదేశం పార్టీలోకి మాత్రం ద్వారాలు మూసుకుపోతాయి. రోజా చంద్రబాబును ఎన్ని తిట్లు తిట్టినా.. తెలుగుదేశం పార్టీని ఎంతగా విమర్శించినా.. భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు మారితే.. మళ్లీ ఆ పార్టీలోకి చేరడానికి ఇబ్బందేమీ ఉండదు.

ఇంతకుముందు రోజా తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైఎస్‌ను, కాంగ్రెస్‌ను తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టి.. చివరికి వైఎస్‌ను కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైంది. కానీ అంతలోనే వైఎస్ వెళ్లిపోవడంతో తర్వాత జగన్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చింది. అలా భవిష్యత్తులో మళ్లీ తెలుగుదేశం బాట పట్టినా ఆశ్చర్యం లేదు. ఐతే విమర్శలు చేయడం ఒక ఎత్తు.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లాంటి సినిమా చేయడం మరో ఎత్తు. ఈ సినిమా అలాగే నిలిచిపోతుంది.

రోజా మీద ఒక ముద్ర పడిపోతుంది. ఆ చిత్రం కచ్చితంగా నందమూరి కుటుంబ సభ్యులకు, చంద్రబాబుకు వ్యతిరేకంగా, ఇబ్బందికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అలాంటి సినిమాలో లక్ష్మీపార్వతి పాత్ర చేసిందంటే రోజాకు తెలుగుదేశం పార్టీ ద్వారాలు మూసుకుపోవడం ఖాయం. కాబట్టి రోజా ఆచితూచి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు