బాహుబలితో వాళ్లు రెచ్చిపోతున్నారు

బాహుబలితో వాళ్లు రెచ్చిపోతున్నారు

బాహుబలి చిత్రంతో అసలు ఇంతవరకు బాలీవుడ్‌ టాప్‌ చేయని మార్కెట్‌ ఎంత వుందనేది తెలిసొచ్చింది. బాలీవుడ్‌ బడా హీరోల సినిమాలకే రాని వసూళ్లు ఒక అనువాద చిత్రానికి రావడంతో బాలీవుడ్‌ ఉద్ధండపిండాలు అవాక్కయ్యారు. ఎలాంటి సినిమాలు తీస్తే రీచ్‌ పెరుగుతుందో, జనాలు కోరుకునే సెవెంటీ ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇవ్వగల సినిమాలేంటో బాహుబలి వల్ల తెలిసొచ్చింది.

దాంతో ఆ తరహా భారీ చిత్రాల రూపకల్పనకి బాలీవుడ్‌ పెద్దలు నడుం బిగించారు. సంజయ్‌ లీలా భన్సాలీ తీసిన పద్మావతి ఇప్పటికే ట్రెయిలర్‌తో హాట్‌ టాపిక్‌ అయింది. యూట్యూబ్‌లో పెట్టిన ఒక్క రోజులోనే రెండు కోట్ల వ్యూస్‌తో ఈ ట్రెయిలర్‌ రచ్చ చేస్తోంది. అమీర్‌ఖాన్‌ ఆల్రెడీ థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ అంటూ భారీ జానపద చిత్రానికి శ్రీకారం చుట్టాడు. తాజాగా కరణ్‌ జోహార్‌ కూడా సారాగర్హి యుద్ధం నేపథ్యంలో అక్షయ్‌కుమార్‌తో కేసరి అనే చిత్రం అనౌన్స్‌ చేసాడు. కొంతమంది సిక్కు సైనికులు కలిసి కొన్ని వేల మంది ఆఫ్గన్లని ఎలా ఎదుర్కొన్నారనేది ఈ చిత్రంలో చూడవచ్చు.

బాలీవుడ్‌లో ఇప్పుడు కొత్తగా అనౌన్స్‌ అవుతోన్న ఏ చిత్రం చూసినా కానీ ఇలా ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటోంది. బాహుబలి వల్ల బడ్జెట్‌ పరిమితులని కూడా పెట్టుకోకుండా బాలీవుడ్‌ నిర్మాతలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఒకటి రెండు పెద్ద హిట్లు పడితే ఇండియన్‌ సినిమా స్వరూపమే మారిపోతుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు