సునీల్ చేసిన గాయానికి దేవరకొండ మందు

సునీల్ చేసిన గాయానికి దేవరకొండ మందు

‘ఓనమాలు’.. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ లాంటి సినిమాలతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు క్రాంతి మాధవ్. ఐతే ఆయన కెరీర్ ఒక స్టయిల్లో సాగిపోతున్న సమయంలో.. కొంచెం భిన్నమైన దారిని ఎంచుకుని బోల్తా కొట్టాడు. సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ తీసిన ‘ఉంగరాల రాంబాబు’ దారుణమైన ఫలితాన్నందుకుంది.

ఆ సినిమా చూస్తే ఇది తీసింది క్రాంతి మాధవేనా అన్న సందేహాలు కలిగాయి. ఈ ఏడాది వచ్చిన చెత్త సినిమాల్లో అదొకటిగా చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది. క్రాంతి మాధవ్ ఇమేజ్ ఈ సినిమాతో బాగా డ్యామేజ్ అయింది. ఈ సినిమా చూస్తే సునీలే తన అభిరుచులన్నింటినీ క్రాంతి మీద రుద్దాడేమో అనిపించింది జనాలకు.

ఐతే ‘ఉంగరాల రాంబాబు’ ఫలితం నుంచి బయటికొచ్చి అర్జెంటుగా తన స్టయిల్లో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు క్రాంతిమాధవ్. అతడికి ఈ విషయంలో మంచి సపోర్టే దొరికింది. ‘అర్జున్ రెడ్డి’తో యూత్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ తో సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమా ఇంతకుముందు నుంచే చర్చల దశలో ఉంది.

ఐతే ‘ఉంగరాల రాంబాబు’ ఫలితం చూశాక విజయ్ వెనక్కి తగ్గుతాడేమో అనుకున్నారు చాలామంది. కానీ విజయ్ అలా ఏమీ చేయలేదు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ పక్కాగా స్క్రిప్టు తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు