‘బ్రహ్మోత్సవం’కు ఏమాత్రం తీసిపోకుండా..

‘బ్రహ్మోత్సవం’కు ఏమాత్రం తీసిపోకుండా..

‘స్పైడర్’ కంటే ముందు మహేష్ బాబు చేసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు ఓవర్సీస్‌లో ప్రిమియర్ల ద్వారా భారీ వసూళ్లు వచ్చాయి. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన సినిమా కావడం, పైగా ఓవర్సీస్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలా కనిపించడంతో దీనికి భారీగా ప్రిమియర్లు వేశారు.

ప్రిమియర్లు, తొలి రోజు వసూళ్లతోనే మిలియన్ డాలర్ మార్కును అందుకుంది ‘బ్రహ్మోత్సవం’. కానీ ఆ తర్వాత ఆ సినిమా ఫలితం ఏమైందో తెలిసిందే. వీకెండ్లోనే బాగా వీక్ అయిపోయిన ఆ సినిమా.. ఫుల్ రన్లో 1.5 మిలియన్ మార్కును కూడా అందుకోలేదు. వీకెండ్ తర్వాత అయితే మరీ దారుణమైన వసూళ్లు వచ్చాయి.

ఇప్పుడు ‘స్పైడర్’ విషయంలోనూ సరిగ్గా అలాగే జరిగింది. మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ క్రేజ్‌తో ఈ చిత్రానికి భారీగా ప్రిమియర్లు వేశారు. తెలుగు, తమిళంలో కలిపి 400కు పైగా లొకేషన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి.. అన్ని చోట్లా ప్రిమియర్లు ప్రదర్శించారు. తెలుగు వెర్షన్ మాత్రమే ప్రిమియర్లతోనే మిలియన్ మార్కును అందుకుంది. కానీ ఈ సినిమాకు కూడా డివైడ్ టాక్ రావడంతో తొలి రోజే వీక్ అయింది. వీకెండ్‌ను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది.

తొలి రోజు షోలు మొదలవ్వడానికంటే ముందే మిలియన్ మార్కును అందుకున్న ఈ చిత్రం.. తర్వాతి పది రోజుల తర్వాత కూడా 1.537 మిలియన్ల దగ్గరే ఉంది. అతి కష్టం మీద 1.5 మిలియన్ మార్కును దాటిన ‘స్పైడర్’.. అక్కడి నుంచి ముందుకు కదలనంటోంది. రెండో వారాంతంలోని మూడు రోజుల్లో ఈ సినిమా వరుసగా 8 వేల డాలర్లు, 15 వేల డాలర్లు, 8 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఈ సినిమాతో బావుకునేదేమీ లేదని బయ్యర్‌కు అర్థమైంది. లాభాల బాట పట్టాలంటే 3 మిలియన్ డాలర్లు తేవాల్సిన ‘స్పైడర్’ సగానికి సగం నష్టమే మిగిల్చేలా ఉంది. ఇలా అన్ని రకాలుగా ‘స్పైడర్’.. ‘బ్రహ్మోత్సవం’కు తీసిపోని సినిమా అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు