200 కోట్లతో దిల్ రాజు సినిమా

200 కోట్లతో దిల్ రాజు సినిమా

‘భారతీయుడు’ సీక్వెల్‌పై ఇప్పటికే అధికారిక సమాచారం వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మన దిల్ రాజే నిర్మాత. అలా అని ఆయన తెలుగు వరకు సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడనుకుంటే పొరబాటే. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ ‘భారతీయుడు-2’కు నిర్మాత రాజే. ఈ సినిమా నిర్మాతగా రాజు ప్రస్థానంలోనే చాలా ప్రత్యేకంగా కాబోతోంది. ఆయనకు ఇదే అత్యంత భారీ సినిమా కాబోతోంది. ఇప్పటిదాకా దిల్ రాజు నిర్మించిన అత్యధిక బడ్జెట్ మూవీ అంటే ‘దువ్వాడ జగన్నాథం’ అనే చెప్పాలి. దానికి రూ.60 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు రాజు. ఐతే ‘భారతీయుడు’ బడ్జెట్ దీనికి మూడు రెట్ల పైనే ఉండబోతోందని సమాచారం. ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్ ఈ సినిమా కోసం కేటాయించాడట రాజు.

శంకర్ సినిమా అంటే ఎంత భారీతనం ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ను ఏకంగా రూ.400 కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తున్నాడు శంకర్. ‘భారతీయుడు’ను కూడా ఇలాగే భారీగా తీయడానికి ప్లాన్ చేశాడు శంకర్. అందుకే బడ్జెట్ రూ.200 కోట్లుగా నిర్ణయించారు. ఐతే శంకర్-కమల్ కాంబినేషన్ క్రేజ్ ప్రకారం చూస్తే బడ్జెట్ గురించి భయం అక్కర్లేదు. పైగా ఇది త్రిభాషా చిత్రం కూడా. ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ‘2.0’ విడుదలైన కొన్ని నెలలకే ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు శంకర్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నాడు రాజు. రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘భారతీయుడు’ అప్పట్లో తెలుగు, తమిళ భాషల్లో సెన్సేషనల్ హిట్టయిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు