తమిళం అన్నారు.. తెలుగుకి ఫిక్స్ చేశారు

తమిళం అన్నారు.. తెలుగుకి ఫిక్స్ చేశారు

బాలీవుడ్లో మూడేళ్ల కిందట సూపర్ హిట్టయిన ‘క్వీన్’ సినిమాను దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ రీమేక్ చేయాలనుకుని హక్కులు తీసుకున్నాడు తమిళ నటుడు, నిర్మాత త్యాగరాజన్. ఐతే కాస్టింగ్ విషయంలో తర్జన భర్జనల వల్ల ఆ సినిమా రీమేక్ వెర్షన్లు మొదలవడానికి చాలా లేటైంది. ఒక దశలో నాలుగు భాషల్లోనూ తమన్నాను కథానాయికగా పెట్టి వేర్వేరుగా రీమేక్‌లు తీయాలని అనుకున్నారు. తర్వాత తమన్నాను తమిళ వెర్షన్‌‌కు కథానాయికగా ఎంచుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ పారితోషకం ఎక్కువ చెప్పడంతో తమన్నాకు టాటా చెప్పేసినట్లుగా స్వయంగా త్యాగరాజనే వెల్లడించాడు. కట్ చేస్తే ఇప్పుడు తమన్నాను తెలుగు వెర్షన్‌కు, తమిళానికి కాజల్‌ను కథానాయికగా ఎంచుకుని నీలకంఠ దర్శకత్వంలో రీమేక్‌లు మొదలుపెట్టేస్తున్నాడు త్యాగరాజన్.

ఈ నేపథ్యంలో ‘క్వీన్’ రీమేక్ తాలూకు మలుపుల గురించి తమన్నా స్పందించింది. ‘క్వీన్’ సినిమా తనకెంతో నచ్చిందని.. అలాంటి సినిమాలో నటిస్తే ఎంత బాగుంటుందో అని అప్పట్లో అనుకున్నానని.. ఇప్పుడు ఆ సినిమా రీమేక్‌లో తనే చేయడం థ్రిల్లింగ్‌గా ఉందని తమన్నా చెప్పింది. ముందు తనను తమిళ వెర్షన్ కోసం అడిగిన మాట వాస్తవమే అని ఆమె వెల్లడించింది. కానీ అప్పుడు తాను తమిళ వెర్షన్‌కు ఓకే చెప్పకపోవడానికి కారణాలేంటన్నది  తమన్నా వెల్లడించలేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా తెలుగులో ‘క్వీన్’ చేసే అవకాశం రావడం తన అదృష్టమని అంది. హిందీలో ‘క్వీన్’గా నటించిన కంగనా రనౌత్‌కు తాను పెద్ద అభిమానినని.. ఆమెను త్వరలోనే కలిసి ‘క్వీన్’ పాత్ర చేయడానికి అవసరమైన టిప్స్ తెలుసుకుంటానని అంది. దర్శకుడు నీలకంఠకు ‘క్వీన్’ రీమేక్ విషయంలో మంచి క్లారిటీ ఉందని, అలాంటి దర్శకుడితో పని చేయడం తన అదృష్టమని తమన్నా చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు