నాని ఎదిగాడు.. మరి శర్వా?

నాని ఎదిగాడు.. మరి శర్వా?

ఒక హిట్టు కొట్టగానే హీరో రేంజ్ మారిపోతుంది. మార్కెట్ పెరుగుతుంది. పారితోషకం పెరిగిపోతుంది. అందులోనూ వరుసగా మూణ్నాలుగు హిట్లిస్తే ఇక చెప్పేదేముంది? నాని, నిఖిల్ సిద్దార్థ, రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండ లాంటి కుర్ర హీరోలు ఇలాగే తమ రేంజ్ పెంచుకున్నారు. ఐతే వీళ్లందరిలోకి ఎక్కువ ఎదిగిందంటే నానినే అని చెప్పాలి. కేవలం నాని పేరు మీద.. అతడి పెర్ఫామెన్స్ మీద సినిమాలు నడిచిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. ‘నేను లోకల్’ లాంటి యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిందన్నా.. జెంటిల్‌మన్, మజ్ను లాంటి బిలో యావరేజ్ సినిమాలు కూడా పెట్టుబడి వెనక్కి తెచ్చాయన్నా అందులో నాని పాత్ర కీలకం. ఓవర్సీస్‌లో నాని సినిమా అంటే మిలియన్ గ్యారెంటీ అన్నట్లుగా తయారైంది. అతడి పారితోషకం కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు నాని దాదాపు రూ.4 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఐతే పైన చెప్పుకున్న లీగ్‌లో శర్వానంద్ కూడా ఉన్నాడు. అతను కూడా వరుసగా హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు. పెర్ఫామెన్స్ విషయంలో నానికి దీటైన యంగ్ హీరో ఎవరైనా ఉన్నారంటే శర్వా అనే చెప్పాలి. నానికి, శర్వాకు ఉన్న తేడా ఏంటంటే.. నాని సినిమాల్లా శర్వా చిత్రాలు కేవలం అతడి పేరు మీద ఆడట్లేదు. గత రెండు మూడేళ్లలో శర్వా హిట్టు కొట్టిన ప్రతి సినిమా కూడా కంటెంట్ పరంగానే ఎక్కువ ఆకట్టుకుంది. ‘రన్ రాజా రన్’ నుంచి లేటెస్ట్ హిట్ ‘మహానుభావుడు’ వరకు అన్నింటికీ కంటెంట్‌తో పాటు వేరే అంశాలు కూడా కలిసొచ్చాయి. మంచి నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేయడం.. బాగా ప్రమోట్ చేయడం.. మంచి టైమింగ్‌లో రిలీజ్ చేయడం బాగా కలిసొచ్చాయి.

మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడం కూడా శర్వాకు అడ్వాంటేజ్ అయింది. కానీ కంటెంట్ వీక్ అయినపుడు శర్వా సినిమాను నిలబెట్టలేకపోతున్నాడు. ఇందుకు ‘రాధ’ ఉదాహరణ. ఈ నేపథ్యంలో శర్వా ఇమేజ్, మార్కెట్ ఏమేరకు పెరిగిందన్న విషయంలో కొంచెం సందేహంగానే ఉంది. నిలకడగా హిట్లు కొడుతున్నా, పెర్ఫామెన్స్ పరంగా కూడా మెప్పిస్తున్నా.. నానిలా సినిమాను హోల్డ్ చేసే, మార్కెట్ విస్తరించుకునే విషయంలో శర్వా ఎదగాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు