ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సమస్య… వెబ్ సైట్లన్నీ క్రాష్..!

ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ లో సమస్య తలెత్తింది. ఈ సమస్య కారణంగా అంతర్జాతీయంగా ప్రముఖ వెబ్ సైట్లన్నీ క్రాష్ అయ్యాయి. అమెజాన్, రెడ్డిట్, యూకే ప్రభుత్వానికి సంబంధించిన వెబ్ సైట్లు సహా.. ప్రముఖ న్యూస్ వెబ్ సైట్లు కూడా క్రాష్ అవ్వడం గమనార్హం.

న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, సీఎన్ఎన్ ఇంటర్నేషనల్, వోక్స్, బీబీసీ, వంటి ఎన్నో ప్రముఖ వార్తాసంస్థల వెబ్‌సైట్లు యూజర్లకు అందుబాటులోకి లేకపోవడం ఇంటర్నెట్ ప్రపంచంలో ఆందోళనకు దారితీసింది. అయితే.. కొద్ది సేపటి తర్వాత.. పరిస్థితి మళ్లీ సద్దుమణిగింది.

ఈ సంస్థలకు క్లౌడ్ సర్వీస్ సేవలను అందించే ఫాస్ట్ లీ సంస్థ సర్వర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇలా జరగడం గమనార్హం. కాగా.. దీనిపై సదరు సంస్థ ఫాస్ట్ లీ ప్రకటన కూడా విడుదల చేసింది.

“సమస్య ఎక్కడుందో గుర్తించి పరిష్కరించాం. అయితే..ఈ వైబ్‌సైట్లకు ట్రాఫిక్ మళ్లీ పుంజుకునే సమయంలో లోడ్ పెరగవచ్చు” అని సదరు సంస్థ పేర్కొంది.

కాగా.. ఫాస్ట్‌లీ సంస్థకు చెందిన కంటెంట్ డెలివరీ వ్యవస్థలో సమస్య కారణంగా ఇలా జరిగిందని ది గార్డియన్ ఎడిటర్ వినియోగదారులకు సమాచారం అందించారు. కొన్ని దేశాలో పలు వెబ్‌సైట్లు అందుబాటులో ఉంటే మరికొన్ని దేశాల్లో 503 ఎర్రర్ సందేశం వచ్చినట్టు వినియోగదారులు చెబుతున్నారు.