మహానుభావుడి మాఫియా కహానీ

మహానుభావుడి మాఫియా కహానీ

సినిమాకో రకంగా కనిపిస్తూ నటుడిగా తనలోని వైవిధ్యాన్ని ప్రతి సినిమాలోను చూపిస్తోన్న శర్వానంద్‌ మహానుభావుడు చిత్రంలో కామెడీతో అలరించాడు. అంతకుముందు శతమానం భవతిలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ పండించాడు. తన తదుపరి చిత్రంలో మాత్రం శర్వానంద్‌ మాఫియా డాన్‌గా కనిపిస్తాడట. స్వామిరారా, కేశవ చిత్రాలని తీసిన సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.

ఇంతవరకు క్రయిమ్‌ థ్రిల్లర్స్‌ తీసిన సుధీర్‌వర్మ ఈసారి మాఫియా నేపథ్యంలో కొత్త తరహా చిత్రం ప్లాన్‌ చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ఈ బ్యానర్‌కి శర్వానంద్‌ రెండు సినిమాలకి డేట్స్‌ ఇచ్చాడు. వరుసగా విజయాలు సాధిస్తోన్న శర్వానంద్‌ తనని ప్రేక్షకులు ఎలాంటి సినిమాల్లో చూడాలని అనుకుంటున్నారనేది క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు.

అందుకు తగ్గట్టే అతని సినిమాలు ప్లాన్‌ చేసుకుంటున్నాడు. అయితే శర్వానంద్‌ హిట్‌ సినిమాలన్నిట్లోను అతను యువత, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలానే కనిపించాడు. ఇప్పుడు మాఫియా డాన్‌ అంటే కాస్త సీరియస్‌ విషయం. దీంతో అతను ఎంతవరకు మెప్పిస్తాడనేది చూడాలి. కానీ మరీ సేఫ్‌ ఆడకుండా ప్రతి సినిమాతోను కొత్తదనం కోసం అన్వేషిస్తున్నందుకు మాత్రం కుర్రాడ్ని అభినందించి తీరాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు