సమంత కాదు.. అను ఇమ్మాన్యుయెల్

సమంత కాదు.. అను ఇమ్మాన్యుయెల్

‘యుద్ధం శరణం’ సినిమాతో పెళ్లికి ముందు పెద్ద ఎదురు దెబ్బే తిన్నాడు అక్కినేని నాగచైతన్య. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడానికి అతను యువ దర్శకుడు మారుతిని నమ్ముకున్నాడు. ఇటీవలే ‘మహానుభావుడు’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మారుతి.

అతడికి చాలా అవకాశాలు వస్తుండగా.. ముందు కమిట్మెంట్ ఇచ్చినట్లే నాగచైతన్యతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. విక్టరీ వెంకటేష్ తర్వాత కొంచెం స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో మారుతి పని చేయబోతున్నది ఇప్పుడే. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను మీడియాతో పంచుకున్నాడు మారుతి.

చైతూ-మారుతి సినిమాలో సమంత కథానాయికగా నటిస్తుందంటూ ఇంతకుముందు రూమర్లు వచ్చాయి. వాటిని ఖండిస్తూ తమ సినిమాలో కథానాయిక ఎవరో వెల్లడించాడు మారుతి. ప్రస్తుతం పవన్ కళ్యాన్, అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్లతో నటిస్తున్న మల్లు బ్యూటీ అను ఇమ్మాన్యుయెల్ చైతూకు జోడీగా నటిస్తుందట. భలే భలే మగాడివోయ్.. మహానుభావుడు సినిమాల్లో హీరోకు ఓ డిజాస్టర్ పెట్టిన మారుతిని.. ఇంకోసారి అదే ఫార్ములాను ప్రయోగిస్తారా అని అడిగితే.. అలాంటిదేమీ లేదన్నాడు.

అక్కినేని హీరోలు లవ్ స్టోరీలకు పెట్టింది పేరని.. చైతూతో తాను తీసేది కూడా ప్యూర్ లవ్ స్టోరీ అని.. తన గత సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుందని చెప్పాడు. చైతూకు ఈ మధ్యే పెళ్లయిన నేపథ్యంలో పెళ్లి తర్వాత వచ్చే ఇబ్బందుల మీద సినిమా తీస్తారా అని అడిగితే.. నవ్వుతూ అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చాడు మారుతి. ఇంతకుముందు మారుతితో ‘బాబు బంగారం’ తీసిన సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లోలనే ఈ చిత్రం తెరకెక్కనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు