దిల్ రాజు చెప్పిన బంతుల కథ

దిల్ రాజు చెప్పిన బంతుల కథ

ఓవర్లో నాలుగు బంతులు అయిపోయాయట. అందులో నాలుగూ బౌండరీలు దాటిపోయాయట. ఐదో బంతి కూడా బౌండరీ గ్యారెంటీ అంటున్నాడు దిల్ రాజు. ఈ బంతులేంటి.. బౌండరీలేంటి అంటారా? ఈ ఏడాది తమ బేనర్ నుంచి వస్తున్న సినిమాల్ని బంతులతో పోల్చాడు రాజు. ఓవర్లో ఆరు బంతులున్నట్లుగా.. తమ బేనర్ నుంచి కూడా ఈ ఏడాది ఆరు సినిమాలు వస్తున్నాయని.. అందులో ఇప్పటికే నాలుగు వచ్చేశాయని అన్నాడు రాజు.

శతమానం భవతి, నేను లోకల్, డీజే, ఫిదా.. ఇవి తొలి నాలుగు బంతుల మాదిరి అని.. ఆ నాలుగూ బౌండరీ దాటిపోయాయని.. ఇప్పుడు ఐదో బంతి ‘రాజా ది గ్రేట్’ కూడా బౌండరీ దాటుతుందని నమ్మకంగా ఉన్నానని చెప్పాడు రాజు. డిసెంబర్లో రాబోయే ‘ఎంసీఏ’ ఆరో బంతి అని.. దాంతో కూడా సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని రాజ్ చెప్పాడు. తమ ఇలవేల్పు వేంకటేశ్వరస్వామి దయ వల్ల ఈ ఏడాది తమ బేనర్ నుంచి వస్తున్న ప్రతి సినిమా బాగా ఆడుతోందని రాజు అన్నాడు.

‘పటాస్’, ‘సుప్రీమ్’ లాంటి సూపర్ హిట్లతో అనిల్ రావిపూడి మంచి కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడని.. ఐతే మూడో సినిమాగా ఏదో స్పెషల్‌గా ఉండేలా చూసుకోమని తాను చెప్పడంతో దాన్ని సవాలుగా తీసుకుని అనిల్.. ఈసారి భిన్నమైన కథతో తన దగ్గరికి వచ్చాడని.. అతడి కథ విని తాను థ్రిల్లయ్యానని.. రవితేజ కూడా కుర్రాడు ఇరగ్గొట్టేశాడని చెప్పాడని.. తమకు కథ చెప్పిందాని కంటే బాగా సినిమాను తెరకెక్కించి ఆశ్చర్యపరిచాడని రాజు చెప్పాడు.

ఇది అనిల్ సినిమాల్లో ది బెస్ట్ అని.. అలాగే రవితేజకు కూడా ఇది బెస్ట్ సినిమా అవుతుందని.. కథ తెలిసి.. ఇంతకుముందే అక్కడక్కడా రషెస్ చూసిన తాను కూడా ఫస్ట్ కాపీ చూశాక రవితేజ పెర్ఫామెన్స్ చూసి స్టన్నయిపోయానని.. అలాంటిది రేప్పొద్దున ప్రేక్షకులు ఎలా ఫీలవుతారో తాను అంచనా వేయగలనని.. రవితేజ పెర్ఫామెన్సే రేప్పొద్దున హెడ్ లైన్స్‌లో ఉంటుందని రాజు అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు