నేనెవరో తెలియదు.. సంతోషం-పవన్ కళ్యాణ్

నేనెవరో తెలియదు.. సంతోషం-పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం పార్టీకి మధ్య అంతరం రోజు రోజుకూ పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. 2014 ఎన్నికల సందర్భంగా ఉన్న స్నేహం ఇప్పుడు బీటలు వారుతున్నట్లే ఉంది. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తుండటం.. ప్రతిగా ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్‌ను తేలిక చేసి మాట్లాడుతుండటం తెలిసిందే. తాజాగా తన గురించి, తన పార్టీ గురించి తెలుగుదేశం నేతలు హేళనగా మాట్లాడటం పవన్ కళ్యాణ్ హర్టయినట్లే ఉన్నాడు. తాజాగా ట్విట్టర్లో పవన్ సెటైరికల్ కామెంట్ ఒకటి పెట్టాడు.

‘‘అశోక్ గజపతి రాజు గారికి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు. మంత్రి పితాని గారికి పవన్ కళ్యాణ్ ఏంటో తెలియదు. సంతోషం’’ అని ట్వీట్ చేశాడు పవన్. ఇటీవల అశోక్ గజపతి రాజు దగ్గర పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెస్తే.. ‘‘పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు’’ అంటూ సెటైరికల్‌గా మాట్లాడారు.

మరోవైపు మంత్రి పితాని కూడా పవన్‌ను, అతడి పార్టీని తేలిక చేసేలా వ్యాఖ్యలు చేశాడు. జనసేన అధినేత కానీ.. ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కడా కనిపించరని.. ఆ పార్టీ జెండా కూడా ఎక్కడ అగుపించదని అన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్‌కు మండినట్లుంది.

2014 ఎన్నికల్లో తన సాయం తీసుకున్న పార్టీ నేతలు.. ఇప్పుడిలా మాట్లాడటం భావ్యమా అన్నట్లుగా సెటైరికల్ ట్వీట్ పెట్టినట్లున్నాడు పవన్. దీనిపై తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు