సరైన టపాసు ఒక్కటీ లేదు!

 సరైన టపాసు ఒక్కటీ లేదు!

టాలీవుడ్ కి ప్రతీ శుక్రవారమూ ఓ పండగే. ఆ రోజు ఏదో ఒక కొత్త బొమ్మ థియేటర్లలో ఆడాల్సిందే. లేదంటే తెలుగు సినిమా అభిమాని ఒప్పుకోడు. అందుకే నెలల ముందు నుంచే శుక్రవారాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటారు దర్శకనిర్మాతలు. శుక్రవారం పరిస్థితే అలా ఉంటె... ఇక  నిజంగా పండగవస్తే? ఆ సందడి మామూలుగా ఉండదు. స్టార్ కథానాయకుల నుంచి కొత్తవాళ్ల వరకు పండగ సీజన్ ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంటారు. అందుకోసం ఎప్పట్నుంచో సినిమాలను సిద్ధం చేసి ఆ రోజు పోటా పోటీగా విడుదల చేస్తుంటారు.

ఈసారి దీపావళికి తెలుగు చిత్రపరిశ్రమలో భారీ సందడి నెలకొంటుందని అందరూ ఊహించారు. `మసాలా`, `ఎవడు` తదితర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావొచ్చనుకున్నారు. కానీ అలా జరగలేదు. వారం రెండు వారాల కింద విడుదలైన సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో థియేటర్ల దగ్గర దీపావళి కాంతి కనిపించడం లేదు. పండగకి పేలే టపాసు ఒక్కటీ కూడా కనిపించడం లేదు. లేటెస్ట్ గా విడుదలైన తెలుగు సినిమా అంటే నాగార్జున నటించిన `భాయ్`. అది ఇప్పటికే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులను ఏ రకంగానూ  ఆకట్టుకోలేకపోయింది. భారీ స్థాయిలో నష్టాలను మూటగట్టుకుంది. అంతకుముందు విడుదలైన `రామయ్యా వస్తావయ్యా` సినిమా ఏదో ఆడాలంటే ఆడాలన్నుట్టుగా, ఎన్టీఆర్ అభిమానుల రాకకోసం థియేటర్ల దగ్గర వేచిచూస్తోంది. కొత్త సన్నివేశాలు కలిపాం అంటూ నిర్మాతలు ప్రచారం చేసుకుంటున్నా `అత్తారింటికి దారేది` సినిమాకి వెళ్ళే ప్రేక్షకులు తక్కువగానే కనిపిస్తున్నారు. ఒకసారి చూశాం చాలు...  అంటున్నారు.  పరిస్థితి చూస్తుంటే బాక్సాఫీసు దగ్గర ఆ సినిమా వంద కోట్ల మైలు రాయిని చేరుకునేలా కనిపించడం లేదు.

కనీసం పరభాషల నుంచి వచ్చిన టపాసులన్నా పేలుతాయేమో అనుకుంటే అలాంటి పరిస్థితేమీ కనిపించడం లేదు. హృతిక్ నటించిన `క్రిష్ 3`, విశాల్ `పల్నాడు` చిత్రాలు ఇప్పటికే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. చూస్తుంటే...  వెంకీ, రామ్ ల `మసాలా` వచ్చే వరకు బాక్సాఫీసు దగ్గర సందడి కనిపించేలా లేదు. మధ్యలో కొన్ని కాళీ చరణ్, నేనేం చిన్న పిల్లనా తదితర సినిమాలు రాబోతున్నాయి. అవి ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English