భరణి పెద్దమనసు చూపించాడు

భరణి పెద్దమనసు చూపించాడు

తనికెళ్ల భరణి మంచి నటుడే కాదు.. గొప్ప రచయిత కూడా. ఆయన ప్రతిభేంటో చెప్పడానికి ‘ఆటగదరా శివా..’ అంటూ శివుడి మీద ఆయన రాసిన గీతాల మాలిక సరైన ఉదాహరణ. తన శివ భక్తిని.. ఆధ్యాత్మిక భావాల్ని గుది గుచ్చి రూపొందించిన ఈ గీతాలకు మంచి స్పందన లభించింది.

ఈ గీతాలు ఇప్పుడు ఓ దర్శకుడికి సినిమా తీసేంతగా స్ఫూర్తినిచ్చాయి. ఆ నలుగురు.. అందరి బంధువయా లాంటి సినిమాలతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందిన చంద్ర సిద్దార్థ.. భరణి ‘ఆటగదరా శివా’ గీతాల స్ఫూర్తితోనే సినిమా తీస్తున్నాడు. ఆ గీతాల సారాన్ని తీసుకుని.. తన ఆలోచనలతో ఆయన ఓ కథ రూపొందించాడు.

ఈ సినిమాకు టైటిల్ కూడా ‘ఆటగదరా శివా’ అనే పెట్టాడు చంద్ర సిద్దార్థ. ఐతే తన టైటిల్.. తన కంటెంట్ ను సినిమా కోసం వాడుకోవడానికి పెద్ద మనసుతో అంగీకరించారట భరణి. ఈ సినిమాలో ‘ఆటగదరా శివా’ పాటలోని కొన్ని పంక్తులు కూడా యథాతథంగా వాడుకున్నారట. ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాతో ఎదురు దెబ్బ తిన్న చంద్ర సిద్దార్థ ఈసారి చాలా గ్యాప్ తీసుకుని ‘ఆటగదరా శివా’ సినిమా చేస్తున్నాడు.

ఇందులో కొత్త వాళ్లే నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కన్నడ స్టార్ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తుండటం విశేషం. అతను ఇంతకుముందు తెలుగులో ‘పవర్’ అనే సినిమా చేశాడు. ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసే వెంకటేష్.. చంద్రసిద్దార్థ దర్శకత్వంలో ఇలాంటి సినిమా చేయడం ఆసక్తి రేకెత్తించేదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు