ఓవర్సీస్‌ బూచి.. ఇలాగైతే అంతే మరి

ఓవర్సీస్‌ బూచి.. ఇలాగైతే అంతే మరి

ఓవర్సీస్‌ మార్కెట్‌లో ఒక సినిమా ఏ రేంజ్‌కి చేరుతుందనేది అంచనా వేయడం కష్టం. తెలుగు రాష్ట్రాల్లో వున్న ప్రణాళికాబద్ధమైన మార్కెట్‌ అక్కడ వుండదు. థియేటర్ల దగ్గర్నుంచి థర్డ్‌ పార్టీల వరకు అన్నిట్లోను వ్యత్యాసం వుంటుంది. ఒక సినిమా కోటి రూపాయలకి కొంటే అయిదు కోట్ల లాభం రావచ్చు. మరో సినిమాని పదిహేను కోట్లకి కొంటే పది కోట్ల నష్టం రావచ్చు.

రాత్రికి రాత్రి కుబేరులైన వారు, మర్నాటికి రోడ్డున పడ్డ వారు చాలా మందే వున్నారు. ప్రతి సినిమాకీ లాటరీ పద్ధతిలో వర్కవుట్‌ అయిపోతుందనే నమ్మకంతో ఎవరో ఒకరు కొనేస్తారు. మళ్లీ వాళ్ల దగ్గర్నుంచి లోకల్‌ పార్టీల వారు కొంటుంటారు. మెయిన్‌ డిస్ట్రిబ్యూటర్‌ కొన్నిసార్లు సేఫ్‌ అయినా కానీ ఆ కింద వున్న వాళ్లయితే సంపాదించింది మొత్తం ఒకే సినిమాతో పోగొట్టుకుంటూ వుంటారు.

దసరాకి విడుదలైన సినిమాలనే తీసుకుంటే, స్పైడర్‌ చిత్రానికి కనీసం ఏడెనిమిది కోట్ల నష్టం ఖాయంగా కనిపిస్తోంది. జై లవకుశ చిత్రానికి కూడా ఒక కోటి రూపాయల వరకు నష్టం తప్పదని ట్రేడ్‌ అంటోంది. మహానుభావుడు చిత్రాన్ని కూడా ఎక్కువ రేటుకి కొనడం వల్ల శర్వానంద్‌ సినిమాలకి తగ్గట్టే ఆడుతున్నా కానీ బయ్యర్‌ రికవర్‌ అవుతాడనే నమ్మకం లేదంటున్నారు.

బాహుబలి 2 చిత్రాన్ని లోకల్‌గా చిన్న ఏరియాలకి కొన్న వారిలో కూడా నష్టాలు చవిచూసిన వారున్నారంటే ఇక ఈ బూచి ఎలాంటిదో చూసుకోండి. ఇరవై మిలియన్లు గ్రాస్‌ చేసిన సినిమాకి కూడా నష్టపోయిన వారున్నారట. ఇకనైనా ఈ మార్కెట్‌ని సరిగ్గా స్టడీ చేసుకుని, ప్రాక్టికల్‌ రేట్స్‌తో బిజినెస్‌ చేయకపోతే కనుక అమాంతం పెరిగిన ఈ మార్కెట్‌ బుడగ అప్పటికప్పుడు పేలిపోవడానికి ఎంతో సమయం పట్టదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు