ఇప్పుడు ఈ ఫార్ములా ఏంది నారా బాబూ..

ఇప్పుడు ఈ ఫార్ములా ఏంది నారా బాబూ..

తొలి సినిమా ‘బాణం’ నుంచి వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించున్నాడు నారా రోహిత్. నిజానికి అతడికి ఉన్న బ్యాగ్రౌండ్, బ్యాకప్ ప్రకారం చూస్తే మాస్ ఇమేజ్ కోసం తహతహలాడిపోవాలి. ఆ తరహా సినిమాలే చేయాలి. కానీ రోహిత్ మాత్రం అలా చేయలేదు. వైవిధ్యమైన సినిమాలే చేశాడు. మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడలేదు.
కథాబలమున్న, కొత్త తరహా సినిమాలే చేశాడు. దీంతో నారా రోహిత్ సినిమా అంటే కొత్తగా ఉంటుంది అన్న అభిప్రాయం జనాల్లో కలిగింది. హిట్లు, ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా తన ముద్రను కొనసాగిస్తూ వెళ్లాడు రోహిత్. ఐతే ఇప్పుడు రోహిత్ నటిస్తున్న కొత్త సినిమా ‘బాలకృష్ణుడు’ తీరు చూస్తే మాత్రం అతడి ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా కనిపించింది.

‘బాలకృష్ణుడు’ టీజర్ చూస్తే.. ఔట్ డేట్ అయిపోయిన ఫార్ములా సినిమాల్ని గుర్తుకు తెచ్చింది. హీరో అతి తెలివైన వాడు అయి ఉండటం.. తన తెలివి తేటలతో అందరినీ బోల్తా కొట్టించేస్తూ తన పనులు పూర్తి చేసుకోవడం.. ఇందుకోసం ఒక బకరాను వాడుకోవడం.. ఇలా ‘ఢీ’.. ‘రెడీ’.. ‘కందిరీగ’ టైపు సినిమాలు గుర్తుకొచ్చాయి ఈ టీజర్ చూస్తే. చాలా వరకు బకరా పాత్రల్ని చేసే బ్రహ్మానందం స్థానంలో పృథ్వీ కనిపించడమే కొత్తదనం అనుకోవాలి.

మొత్తంగా టీజర్లో ఏమాత్రం కొత్తదనం అయితే కనిపించలేదు. తనకు నప్పని మాస్ క్యారెక్టర్ ట్రై చేసినట్లున్నాడు రోహిత్ ఇందులో. రోహిత్ మరోసారి కొత్త దర్శకుడితో చేస్తుండటం, దీని ఫస్ట్ లుక్ వెరైటీగా ఉండటంతో సినిమా కూడా కొత్తగా ఉంటుందనుకున్నారు  కానీ.. టీజర్ చూస్తే మాత్రం ఆ ఛాయలేమీ కనిపించలేదు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు