‘స్పైడర్’ తేడాపై మురుగదాస్ ఏమన్నాడంటే..

 ‘స్పైడర్’ తేడాపై మురుగదాస్ ఏమన్నాడంటే..

‘స్పైడర్’ సినిమాకు తెలుగులో చాలా వరకు నెగెటివ్ టాకే వచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా ఈ చిత్రానికి తమిళంలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అక్కడ టాక్ బాగుంది, వసూళ్లు కూడా బాగున్నాయి. మరి ఒకే సినిమాకు రెండు చోట్ల వేర్వేరుగా టాక్ రావడం.. కలెక్షన్లు కూడా దానికి తగ్గట్లే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం.

మనవాడైన మహేష్ బాబు నటించిన సినిమాను ఇక్కడి వాళ్లను తిరస్కరిస్తుంటే.. వేరే భాషకు చెందిన వాళ్లు ఆదరించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ విషయంలో ‘స్పైడర్’ దర్శకుడు మురుగదాసే స్వయంగా ఆసక్తికర విశ్లేషణ చేశాడు.

మహేష్ బాబు తెలుగులో పెద్ద హీరో అని.. అతడి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ‘స్పైడర్’లో మహేష్ మార్కు హీరోయిజం ఆశించారని.. ఐతే ఇది స్టోరీ డ్రివెన్ మూవీ కావడంతో హీరోయిజం ఆశించిన స్థాయిలో లేదని అన్నాడు మురుగదాస్. ఐతే తమిళ ప్రేక్షకులకు మహేష్ బాబు కొత్తవాడని.. కాబట్టి ఒక స్టార్ హీరోలా అతణ్ని చూడలేదని.. కాబట్టి ఇందులో హీరోయిజం లేకపోయినా వాళ్లకు ఇబ్బంది లేకపోయిందని.. అందుకే సినిమాను కూడా బాగా రిసీవ్ చేసుకున్నారని మురుగదాస్ అన్నాడు.

‘స్పైడర్’ సినిమా తమిళ హక్కుల్ని లైకా ప్రొడక్షన్ వాళ్లు రూ.18 కోట్లకు కొనుగోలు చేసి  పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. దీనికి పోటీగా రిలీజైన తమిళ సినిమాల్ని వెనక్కి నెట్టి ‘స్పైడర్’ బాక్సాఫీస్ లీడర్ గా నిలవడం విశేషం. ఈ చిత్రం అక్కడ బయ్యర్లకు మంచి లాభాలే అందించేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు