క్ష‌మించండి....హీరో ప్ర‌భుకు ప‌ళ‌ని ఫోన్‌!

క్ష‌మించండి....హీరో ప్ర‌భుకు ప‌ళ‌ని ఫోన్‌!

అక్టోబ‌ర్ 1 న శివాజీ గ‌ణేష‌న్ జ‌యంతి సంద‌ర్భంగా శివాజీ గ‌ణేష‌న్ స్మార‌క మండ‌పాన్ని ఆవిష్క‌రించాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.  ఆ కార్య‌క్ర‌మానికి త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌ని స్వామి, డిప్యూటీ సీఎం హాజ‌రుకావ‌డం లేదు. దీంతో, శివాజీ గ‌ణేష‌న్ కుమారుడు ప్ర‌భు...తమిళ‌నాడు రాష్ట్ర  సమాచార మంత్రి సెల్లూర్ కె రాజుకు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. సీఎం, డిప్యూటీ సీఎం హాజ‌రుకాకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌డం ఆ మహా నటుడిని అవమానించడమేనని ప్రభు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ లేఖ‌పై సీఎం ప‌ళ‌ని స్వామి స్పందించారు. ప్రభుకు స్వ‌యంగా ఫోన్‌ చేసి క్షమాపణలు చెప్పారు. ఆ  ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరుకాకపోవడానికి గ‌ల‌ కారణాలు వివరించారు. తన బదులు డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రవుతార‌ని చెప్పారు.

శివాజీ గ‌ణేష‌న్ స్మార‌క మండ‌పాన్ని స్వయంగా ప్రారంభించాల‌ని త‌న‌కూ ఆశగా ఉందని ప‌ళ‌ని స్వామి చెప్పారు. అయితే, అంత‌కు ముందు ఖరారైన‌ కొన్ని కార్యక్రమాల కారణంగా తాను ఆరోజు అందుబాటులో ఉండ‌డం లేద‌న్నారు. అందుకే, త‌న‌కు బ‌దులుగా డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం ఆ ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మానికి వస్తార‌ని పళని స్వామి చెప్పారు. గతంలో శివాజీ గ‌ణేష‌న్ విగ్ర‌హం చెన్నైలోని మెరీనా బీచ్ ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ కామరాజర్‌ సాలయ్‌ వద్ద ఉండేది. అయితే, ఆ విగ్ర‌హం ట్రాఫిక్ కు అంత‌రాయం క‌లిగిస్తోంద‌ని  గాంధేయవాది శ్రీనివాసన్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డంతో దానిని అక్క‌డ నుంచి తొల‌గించాల‌ని మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఆ విగ్ర‌హాన్ని అక్క‌డి నుంచి ఆగ‌స్టులో తొల‌గించారు. పూర్తిగా ద్రవిడియన్‌ పద్థతిలో నిర్మించిన‌ శివాజీ గణేశన్ స్మార‌క మండ‌పంలో ఆ విగ్ర‌హాన్ని పునః ప్ర‌తిష్టించాల‌ని నిర్ణ‌యించారు.  

దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఈ మండ‌పం కోసం 2015లో రూ.2.80కోట్ల నిధులు కేటాయించారు. స్థానిక అడయారులోని సత్యా స్టూడియో ఎదురుగా స్థ‌లంలో శివాజీ గ‌ణేష‌న్ స్మార‌క మండపం నిర్మాణాన్నిగ‌త ఏడాది డిసెంబ‌రులో ప్రారంభించారు. ఈ ఏడాది మేలో ఆ స్మారకమండపం నిర్మాణం  పూర్తయింది. అక్టోబ‌ర్ 1 న శివాజీ గ‌ణేష‌న్ 89వ‌ జ‌యంతి సంద‌ర్భంగా ఈ స్మార‌క మండ‌పాన్ని ఆవిష్క‌రించాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు