కోలీవుడ్లో ఆ గొడవ.. అసలేం జరిగింది?

కోలీవుడ్లో ఆ గొడవ.. అసలేం జరిగింది?

ఇప్పుడు కోలీవుడ్లో ఎక్కడ చూసినా టి.రాజేందర్ పేరే వినిపిస్తోంది. ఒక సినిమాకు సంబంధించిన వేడుకలో హీరోయిన్ ధన్సిక తన పేరు ప్రస్తావించకుండా ప్రసంగం ముగించిందన్న కారణంతో టి.రాజేందర్ ఆమెను వేదిక మీదే దులిపేశాడు. ‘కబాలి’ సినిమాలో రజినీకాంత్‌కు కూతురిగా నటించిన ధన్సిక ఎంతగా సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. చివరికి రాజేందర్‌కు పాదాభివందనం చేసినా ఆయన తగ్గలేదు. నువ్వు నా గురించి పొగిడితే.. అదేమైనా నాకు పెద్ద సర్టిఫికెటా.. నాకు రాని పొగడ్తలా అని అంటూనే.. తన గురించి ప్రస్తావించనందుకు ఆమెను తిట్టిపోశాడు రాజేందర్.

ఐతే తన ప్రసంగమంతా పూర్తవబోతుండగా.. విషయం తీవ్రత అర్థం చేసుకుుని.. తాను కావాలనే ధన్సికను తిట్టానని.. ఇలా వివాదాలు క్రియేట్ చేస్తేనే సినిమాకు పబ్లిసిటీ వస్తుందన్న ఉద్దేశంతో అలా చేశానని మాట మార్చాడు. ఆయన ఈ మాట చెబుతుండగానే ధన్సిక కన్నీళ్లు పెట్టుకుంది. ఎమోషనల్ అయిపోయింది. దీనిపై కోలీవుడ్లో పెద్ద దుమారమే రేగింది. టి.రాజేందర్ మీద అందరూ విరుచుకుపడ్డారు. నిర్మాతల మండలి అధ్యక్షుడైన హీరో్ విశాల్ సైతం దీనిపై స్పందించాడు. టి.రాజేందర్‌ను తప్పుబట్టాడు. అమ్మాయిలు సినిమాల్లోకి రావడమే పెద్ద సవాలని.. ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి వస్తారని.. అలాంటి వాళ్లను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నాడు. తాను కూడా తన ప్రసంగాల్లో చాలాసార్లు పేర్లు మరిచిపోయానని.. అంతమాత్రాన అలా ఎటాక్ చేయడం కరెక్ట్ కాదని అన్నాడు.

ఐతే తాను పబ్లిసిటీ కోసమే ధన్సికను తిట్టానని రాజేందర్ అనడం.. మరోవైపు ధన్సిక కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే ఈ మొత్తం వ్యవహారంలో ఏది వాస్తవమో ఏది డ్రామానో జనాలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు