రామ్ చరణ్.. మారిన మనిషి

రామ్ చరణ్.. మారిన మనిషి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ఆరంభంలో చాలా అణకువతో కనిపించేవాడు. కానీ ‘మగధీర’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాక అతడిలో మార్పు కనిపించింది. ఓ సందర్భంలో దాసరి నారాయణరావు లాంటి పెద్దాయన్న తేలిక చేసేలా మాట్లాడి తీవ్ర విమర్శలెదుర్కొన్నాడు చరణ్. తర్వాత ‘నాయక్’ ఆడియో వేడుక వేదిక మీద ‘వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ పొగరుగా అన్న మాట కూడా చరణ్‌కు బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చింది. దీనికి తోడు హైదరాబాద్‌లో నడి రోడ్డుపై ఒక వ్యక్తిపై దాడికి దిగడం కూడా అతడి ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. జనాల్లో వ్యతిరేకత పెంచింది. రామ్ చరణ్‌ యారొగెంట్ అన్న అభిప్రాయం బలపడేలా చేసింది. ఐతే చరణ్ ఇప్పుడు తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లే కనిపిస్తున్నాడు.

గత కొంత కాలంగా రామ్ చరణ్ ఒద్దికగా.. పద్ధతిగా కనిపిస్తున్నాడు. వేదికలెక్కినపుడు చాలా అణకువలతో మాట్లాడుతున్నాడు. దర్శకుడు, శ్రీవల్లీ లాంటి చిన్న సినిమాల ఆడియో వేడుకలకు వచ్చి చరణ్ మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అతడిపై గతంలో ఉన్న ఇమేజ్‌ను కొంచెం మార్చాయి. మరోవైపు తనకు పోటీగా ఉన్న హీరోల్ని అభినందించే విషయంలో కూడా చరణ్ తన హుందాతనం చూపించాడు. ‘శ్రీమంతుడు’ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ నుంచి తనను అభినందించిన ఏకైక హీరో చరణే అని మహేష్ చెప్పడం గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు ‘జై లవకుశ’ సినిమా చూసి ఎన్టీఆర్ అండ్ టీంకు పార్టీ ఇవ్వడం.. తారక్‌ను ప్రేమగా కౌగిలించుకుంటూ ఫొటో దిగడం కూడా చరణ్ మీద జనాలకు మంచి అభిప్రాయం కలిగేలా చేశాయి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం ఎంత అవసరమో చరణ్‌కు ఇప్పుడు బాగానే అర్థమవుతోంది. ఇంతకుముందు బన్నీ ఇలాగే ఉండి జనాల్ని ఆకట్టుకున్నాడు. ఐతే ఈ మధ్య అతను పవన్ కళ్యాణ్ అభిమానుల విషయంలో.. రివ్యూల విషయంలో చేసిన వ్యాఖ్యలు అతడి ఇమేజ్‌ను దెబ్బ తీశాయి. యారొగెంట్ ముద్ర పడిపోయింది అతడిపై. అదే సమయంలో చరణ్ అణకువ ప్రదర్శిస్తూ ఇమేజ్ బిల్డ్ చేసుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు