టాలీవుడ్లో ఇది రేర్ సిచువేషన్

టాలీవుడ్లో ఇది రేర్ సిచువేషన్

మామూలుగా ఓ పెద్ద సినిమాను చూసి చిన్న సినిమా బెదురుతుంటుంది. పెద్ద సినిమాకు పోటీగా చిన్న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నపుడు ఏమవుతుందో అన్న కంగారు ఆ చిన్న సినిమా నిర్మాతలో ఉంటుంది. కానీ ఇప్పుడు టాలీవుడ్లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఓ చిన్న సినిమాను చూసి.. రెండు పెద్ద సినిమాలు బెదురుతున్నాయి. ఆ చిన్న సినిమాకు ఎక్కడ సూపర్ హిట్ టాక్ వచ్చి.. తాము దెబ్బ తింటామో అని పెద్ద సినిమాల నిర్మాతలు కంగారు పడే పరిస్థితి తలెత్తుతోంది. ఆ చిన్న సినిమా.. మహానుభావుడు కాగా, రెండు పెద్ద సినిమాలు.. జై లవకుశ, స్పైడర్.

వారం కిందట వచ్చిన ‘జై లవకుశ’.. రెండు రోజుల కిందటే రిలీజైన ‘స్పైడర్’ల మీద భారీగా పెట్టుబడులు పెట్టారు బయ్యర్లు. ఐతే ఈ రెండు సినిమాలకూ టాక్ ఏమంత గొప్పగా లేదు. రెంటికీ డివైడ్ టాక్ వచ్చింది. ‘జై లవకుశ’ ఇంకా పెట్టుబడిలో రికవర్ చేయాల్సింది చాలా ఉంది. ఇప్పటిదాకా ఆ చిత్రం రూ.65 కోట్లకు అటు ఇటుగా షేర్ రాబట్టినట్లు అంచనా.

ఆ సినిమా సేఫ్ జోన్లోకి రావాలంటే ఇంకా రూ.20 కోట్ల దాకా షేర్ రాబట్టాలి. ఇక ‘స్పైడర్’ మీద ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెట్టారు బయ్యర్లు. ఆ చిత్రానికి ‘జై లవకుశ’ కంటే కూడా ఎక్కువ నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ టాక్‌ను తట్టుకుని తొలి రెండు రోజుల్లో మంచి వసూళ్లే సాధించినప్పటికీ.. ఇంకా రాబట్టాల్సింది చాలానే ఉంది. ఈ రెండు సినిమాలకూ ఈ వీకెండ్ చాలా కీలకం.

ఐతే శుక్రవారం విడుదలవుతున్న ‘మహానుభావుడు’ మీద సూపర్ పాజిటివ్ బజ్ ఉంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ఆడియన్స్‌కు అది ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. అప్పుడు రెండు పెద్ద సినిమాలకు బ్యాండ్ తప్పదు. ఈ నేపథ్యంలోనే ‘మహానుభావుడు’కు ఎలాంటి టాక్ వస్తుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆ రెండు పెద్ద సినిమాల మేకర్స్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు