తల రాత మార్చేసిన బిగ్‌బాస్‌

తల రాత మార్చేసిన బిగ్‌బాస్‌

ఓవియా అనే నటి వుందని కూడా తమిళనాడులో చాలా మందికి తెలియదు. ఒకటీ అరా చిన్న చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన ఓవియా 'బిగ్‌బాస్‌' షోతో ఒక్కసారిగా పాపులర్‌ అయింది. చిట్టి నిక్కర్లు వేసుకుని ప్రేక్షకులని రెచ్చగొట్టేలా నవ్వులు విసురుతూ 'క్యూటీ పై' వేషాలతో కుర్రాళ్లని ఆకట్టుకుంది. తర్వాత తనపై బిగ్‌బాస్‌ హౌస్‌లో పాలిటిక్స్‌ జరిగితే అన్నిటికీ గట్టిగా బదులిచ్చి మరీ నిలబడింది.

దీంతో ఓవియా ఆర్మీ అంటూ సోషల్‌ మీడియాలో తనకో సైన్యం ఏర్పడింది. తమిళ బిగ్‌బాస్‌కి టీఆర్పీలు పెరగడంలో దోహదపడిన ఓవియా హౌస్‌లో జరిగే రాజకీయాలతో పడలేక బయటకి వాకౌట్‌ చేసింది. అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేసి సగంలో వచ్చేసినా కానీ ఓవియా ఇప్పుడు తమిళనాడులో చాలా ఖ్యాతి గడించింది. అందుకే ఆమెతో సినిమాలు తీయడానికి పలువురు నిర్మాతలు ఉత్సాహపడుతున్నారు.

ముని/కాంచన సిరీస్‌లో మరో చిత్రం చేయడానికి ఉవ్విళ్లూరుతోన్న లారెన్స్‌ ఆ సినిమాలో ఓవియాని తీసుకున్నాడని సమాచారం. ఓవియా వల్ల యూత్‌నుంచి స్పందన బాగా ఎక్కువ వుంటుందని మిగతా హీరోయిన్లని కాదని ఆమెని తీసుకున్నాడట. నిన్నమొన్నటి వరకు అవకాశాల కోసం ఎదురు చూసిన ఈ అమ్మడికి ఇప్పుడు అదృష్టం తలుపు తట్టి మరీ లేపుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు