‘క్వీన్’ రీమేక్ ముచ్చట్లు.. దండం బాబోయ్

‘క్వీన్’ రీమేక్ ముచ్చట్లు.. దండం బాబోయ్

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘క్వీన్’ రిలీజై మూడేళ్లు దాటింది. ఆ సినిమా సౌత్ రీమేక్‌ల గురించి రెండేళ్లుగా చర్చలు సాగుతున్నాయి. తమిళ హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ఈ చిత్ర రీమేక్ హక్కులు తీసుకుని నాలుగు దక్షిణాది భాషల్లోనూ పునర్నిర్మించబోతున్నట్లు ప్రకటించాడు. త్రిష అని.. ఛార్మి అని.. నిత్యా మీనన్ అని.. తమన్నా అని.. అమలా పాల్ అని.. ఇలా చాలామంది పేర్లు ‘క్వీన్’ రీమేక్ కోసం తెరమీదికి వచ్చాయి. ఓ దశలో నాలుగు భాషలకు వేర్వేరుగా హీరోయిన్లు, దర్శకుల్ని ప్రకటించి ఇక సినిమా మొదలుపెట్టడమే ఆలస్యం అన్నట్లుగా కలరింగ్ ఇచ్చాడు త్యాగరాజన్. కానీ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు.

చివరికి కొన్ని నెలల కిందట కన్నడ ‘క్వీన్’ షూటింగ్ మొదలైంది. మిగతా వెర్షన్ల సంగతి ఎటూ తేలకుండా పోయింది. ఐతే ఇప్పుడు కాజల్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో ‘క్వీన్’ రీమేక్ మొదలు కాబోతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు మలయాళ వెర్షన్ గురించి కూడా అప్ డేట్ ఇచ్చారు. ఇంతకుముందు ‘క్వీన్’గా అనుకున్న అమలా పాల్ స్థానంలో ఇప్పుడు కొత్త పేరు తెరపైకి వచ్చింది. ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఫేమ్ మాంజిమా మోహన్ మలయాళ ‘క్వీన్’గా నటిస్తుందట.

ఐతే మలయాళంలో నటించిన తొలి సినిమా ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’తో పాటు ‘సాహసం శ్వాసగా సాగిపో’ విషయంలోనూ మాంజిమా విమర్శలు ఎదుర్కొంది. అలాంటమ్మాయి ‘క్వీన్’ లాంటి సినిమాకు సూటవుతుందా అన్న చర్చ నడుస్తోంది. ఆమె రాంగ్ ఛాయిస్ అంటున్నారు. ఐతే ఇంకొందరు మాత్రం ఈ సినిమా పట్టాలెక్కేది లేదు అయ్యేది లేదు.. ఈ మాత్రం దానికి డిస్కషన్లు ఎందుకంటూ ఈ ‘క్వీన్’ ముచ్చట్లకో దండం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి మాంజిమాతో మలయాళ ‘క్వీన్’ నిజంగానే పట్టాలెక్కుతుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు