అక్టోబర్ అంతా సోలో బ్యాటింగే..

అక్టోబర్ అంతా సోలో బ్యాటింగే..

దసరా సీజన్లో ఎనిమిది రోజుల వ్యవధిలో మూడు క్రేజీ సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. అంతకుముందు మూడు వారాల్లో ఆరేడు సినిమాల దాకా వచ్చాయి. మొత్తానికి ఈ నెలంతా సినిమాల జాతరే నడిచింది. ఐతే దసరా సీజన్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ డల్లవబోతోంది. అక్టోబర్లు పెద్దగా రిలీజులేమీ లేవు.

ఈ నెలలో చెప్పుకోదగ్గ సినిమాలు మూడే. అవి ఒకదానితో ఒకటి పోటీ పడట్లేదు. వేర్వేరు వారాంతాల్లో రాబోతున్నాయి. ఈ వారంలో ‘స్పైడర్’.. ‘మహానుభావుడు’ లాంటి క్రేజీ సినిమాలు రావడంతో వచ్చే వారాంతానికి ఇప్పటిదాకా ఏ సినిమా కూడా షెడ్యూలవ్వనే లేదు. ఒకవేళ ఏదైనా రేసులోకి వచ్చినా.. అది ఏదైనా చిన్న సినిమానే అయి ఉంటుంది.

ఆ తర్వాతి వారాంతంలో అక్కినేని నాగార్జున సినిమా ‘రాజు గారి గది-2’ రాబోతోంది. ముందు ఆ వీకెండ్లోనే రవితేజ మూవీ ‘రాజా ది గ్రేట్’ను కూడా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. తర్వాత ఆలోచన మారిపోయింది. ఆ సినిమా తర్వాతి వీకెండ్లో రాబోతోంది. అక్టోబరు 19న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తారు. ఆ తర్వాతి వీకెండ్‌కు రెండు సినిమాలు షెడ్యూలయ్యాయి.

ఒకటి గోపీచంద్ మూవీ ‘ఆక్సిజన్’ కాగా.. ఇంకోటి రామ్ సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. వీటిలో రామ్ సినిమా మాత్రమే పక్కా అనుకుంటున్నారు. గోపీచంద్ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ నేపథ్యంలో ఈ సినిమా అక్టోబరు 27న అయినా వస్తుందా అన్నది సందేహమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు