‘స్పైడర్’ థియేటర్ని తగలబెట్టేశారు

‘స్పైడర్’ థియేటర్ని తగలబెట్టేశారు

బెనిఫిష్ షో వేసి అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకోవడం మాటేమో కానీ.. తేడా వస్తే అసలుకే మోసం వచ్చేస్తుంటుంది. బెనిఫిట్ షో కోసం ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు కొనే అభిమానులు.. షో విషయంలో తేడా వస్తే తమలోని మరో కోణాన్ని చూపిస్తారు. గతంలో తిరుపతిలోని ఒక థియేటర్‌‌ను ఒక హీరో ఫ్యాన్స్ దారుణంగా ధ్వంసం చేశారు. దీంతో పాటు రెండు ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

అయినా కొన్ని థియేటర్ల యాజమాన్యాలు మేలుకోవట్లేదు. తాజాగా గుంటూరు జిల్లా వినుకొండలోని ఓ థియేటర్లలో మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. పోలీసుల నుంచి పర్మిషన్ తెచ్చుకోకుండానే ఆ థియేటర్ యాజమాన్యం బుధవారం ఉదయం 6 గంటలకు బెనిఫిట్ షో ఉంటుందని ప్రకటించింది. అంతే కాక రూ.500 చొప్పున టికెట్ రేటు పెట్టేసి అమ్మకాలు కూడా పూర్తి చేసింది. టికెట్లు కొన్ని అభిమానులు గంట ముందే వచ్చి హంగామా మొదలుపెట్టారు.

ఐతే సమయానికి షో పడలేదు. అభిమానులు గొడవ చేస్తే.. ఆరు గంటల షో రద్దయిందని, పది గంటలకు షో వేస్తామని ప్రకటించింది. అంతే.. మహేష్ అభిమానులు రెచ్చిపోయారు. అందరికంటే ముంందు బెనిఫిట్ షో చూద్దామని 500 రూపాయలకు టికెట్ కొని ఎంతో ఆశగా వస్తే ఇలా చేస్తారా అంటూ థియేటర్ మీద దాడికి దిగారు. సీట్లు ధ్వంసం చేశారు. థియేటరుకు నిప్పు కూడా పెట్టారు.

దీంతో ఆ థియేటర్ బాగా దెబ్బ తిన్నట్లు సమాచారం. తర్వాత పోలీసులు వచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు. అభిమానులకు సర్దిచెప్పి బయటికి పంపించారు. అభిమానుల దాడిలో థియేటర్ ధ్వంసం అయినందుకు బాధపడుతున్న యాజమాన్యానికి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. బెనిఫిట్ షోకు అనుమతి లేకుండా టికెట్లు అమ్మినందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు