‘స్పైడర్’పై ఆ భ్రమలు తొలగించిన మహేష్

 ‘స్పైడర్’పై ఆ భ్రమలు తొలగించిన మహేష్

కొన్ని నెలల కిందట వచ్చిన ‘స్పైడర్’ టీజర్ గ్లింప్స్ చూడగానే ఈ సినిమాపై ప్రేక్షకులకు ఒక రకమైన అంచనాలు ఏర్పడ్డాయి. అందులో కనిపించిన రోబోటిక్ స్పైడర్ ప్రేక్షకులకు రకరకాల ఆలోచనలు కలిగించింది. ఇది హాలీవుడ్ సైంటిఫిక్ థ్రిల్లర్ల తరహాలో తెరకెక్కిన సినిమా అని.. ఇందులో రోబోటిక్ స్పైడర్‌ది కీలక పాత్ర అని.. దాని చుట్టూనే కథ తిరుగుతుందని.. ఇలా రకరకాలుగా అనుకున్నారు జనాలు. ఐతే నిజానికి ఇది కేవలం టీజర్ గ్లింప్స్ కోసం తయారు చేసిన కాన్సెప్ట్ అని.. దానికి సినిమాకు ఎలాంటి సంబంధం లేదని మహేష్ బాబు రిలీజ్ ముంగిట క్లారిటీ ఇచ్చేశాడు.

టీజర్ గ్లింప్స్ కొత్తగా ఉండాలన్న ఉద్దేశంత ఆ రోబోటిక్ స్పైడర్ కాన్సెప్ట్‌ను మురుగదాస్ తయారు చేశాడని మహేష్ వెల్లడించాడు. సినిమాలో ఈ రోబోటిక్ స్పైడర్ లాంటిదేమీ ఉండదను అతను స్పష్టం చేశాడు. ఈ దశలో ప్రేక్షకులకు ఈ విషయం చెప్పకపోతే.. కన్ఫ్యూజ్ అవుతారని.. సినిమాలో అది లేకుంటే నిరాశ చెందుతారని.. అందుకే ఈ విషయాన్ని ముందుగానే చెబుతున్నానని అన్నాడు మహేష్. సినిమాలో ఏం ఉంటుందన్నది తాము ట్రైలర్లో చూచాయిగా చెప్పామని.. దానికి కట్టుబడే సినిమా కూడా ఉంటుందని మహేష్ చెప్పాడు.

ఐతే సినిమాలో ప్రేక్షకులకు ఎగ్జైట్మెంట్ కలిగించే చాలా హైలైట్లు ఉంటాయని.. వాటిని ఉద్దేశపూర్వకంగానే దాచి పెట్టామని.. తెరమీద వాటిని చూసినపుడు థ్రిల్లవుతారని.. ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేసే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ‘స్పైడర్’ అవుతుందని మహేష్ ధీమా వ్యక్తం చేశాడు.