విశాల్ పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు

విశాల్ పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు

తమిళ స్టార్ హీరో విశాల్‌కు, తమిళ సినిమాల్ని పైరసీ చేసి అప్ లోడ్ చేసే వెబ్ సైట్లకు మధ్య పోరు హోరాహోరీగానే సాగుతోంది. నిర్మాతల మండలి అధ్యక్షుడైన వెంటనే పైరసీకి వ్యతిరేకంగా గట్టి పోరాటమే చేస్తున్న విశాల్.. తన కొత్త సినిమా ‘తుప్పారివాలన్’ విడుదలకు ముందు తాను ఏర్పాటు చేసిన యాంటీ పైరసీ టీం సాయంతో ‘తమిళ్ గన్’ అనే పైరసీ వెబ్ సైట్ అడ్మిన్ అరెస్టుకు కారణమైన సంగతి తెలిసిందే.

మరోవైపు ‘తుప్పారివాలన్’ పైరసీ కాకుండా యాక్షన్ టీంను రంగంలోకి దించి మానిటరింగ్ చేయించాడు విశాల్. అయినప్పటికీ ఓ పైరసీ వెబ్ సైట్ ఈ సినిమాను పైరసీ చేసి అప్ లోడ్ చేసేసింది. మరోవైపు విజయ్ సినిమా ‘మెర్సల్’ను పైరసీ చేసి వెబ్ సైట్లో పెడతామంటూ ‘తమిళ్ రాకర్స్’ వెబ్ సైట్ ప్రకటన చేసి ఆశ్చర్యపరిచింది.

ఐతే విశాల్ ఏమీ తక్కువ వాడు కాదు. పైరసీ వెబ్ సైట్ల భరతం పడతానంటూ అతనూ ప్రకటన చేశాడు. ఏడాదిలో తాను తమిళ పరిశ్రమలో పైరసీ జాఢ్యమే లేకుండా చేస్తానని అతను శపథం చేశాడు. ఏడాది లోపు తమిళ సినిమాల్ని పైరసీ చేసి పెట్టే ప్రముఖ వెబ్ సైట్లన్నింటినీ మూత వేయించడమే ధ్యేయంగా తాను పనిచేస్తతున్నట్లు విశాల్ తెలిపాడు. ఇందుకోసం కార్యాచారణ సిద్ధంగా ఉందని.. పైరసీ చేసే వాళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టనని అతను ప్రకటించాడు.

నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ సాగిపోతున్న విశాల్‌కు పైరసీని నిర్మూలించడం మాత్రం చాలా పెద్ద సవాలే. ఇంటర్నెట్ అంటేనే ఓ సముద్రం. రోజు రోజుకూ అది విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఏడాదిలోపు పైరసీ వెబ్ సైట్లన్నీ మూత పడేలా చేస్తాననడం చాలా పెద్ద స్టేట్మెంటే. మరి ఈ మాటను అతనెలా నిలబెట్టుకుంటాడో చూడాలి.   

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు