ఆ మాటకు సంపూ చచ్చిపోవాలనుకున్నాడట..

ఆ మాటకు సంపూ చచ్చిపోవాలనుకున్నాడట..

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మళ్లీ లైన్లోకి వచ్చాడు. ‘బిగ్ బాస్’ షోతో ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతాడని అనుకుంటే.. హౌస్ లోపల ఒత్తిడి భరించలేక రెండో వారానికే తనంతట తానుగా ఎలిమినేట్ అయిపోయి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు సంపూ. అలా ఎలిమినేట్ అయ్యాక వార్తల్లో లేకుండా పోయిన సంపూ.. మళ్లీ ఇప్పుడు ‘బిగ్ బాస్’ షో ముగింపు సందర్భంగా హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వడం ద్వారా వార్తల్లోకి వచ్చాడు.

 షో నుంచి వెళ్లిపోయాక తన ఇంట్లో.. ఊర్లో ఎదురైన అనుభవాల గురించి అతను పంచుకున్నాడు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సభ్యులతో నిర్వహించిన చిట్‌ చాట్‌ సందర్భంగా సంపూతో ఎన్టీఆర్ సంభాషణ ఆసక్తికరంగా సాగింది.

షో నుంచి అనూహ్య రీతిలో నిష్క్రమించాక తన ఊళ్లోవాళ్లంతా తనకు బాగా సపోర్ట్ చేశారని సంపూ చెప్పాడు. ‘బిగ్‌ బాస్’ రెండో సీజన్లో అవకాశం వస్తే.. తాను చివరి వరకు ఉండడానికి ప్రయత్నిస్తానని సంపూ చెప్పాడు. ‘బిగ్‌ బాస్’ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది అని ఎన్టీఆర్ అడగ్గా.. ‘‘నేను ఇంటికి వెళ్లగానే నా కూతురు నా దగ్గరకొచ్చి ‘నాన్నా.. నువ్వు నిజంగానే ఏడ్చావా.. లేక అది టాస్కా’ అని అడిగింది. ఆ మాట వినగానే నాకు చచ్చిపోవాలనిపించింది’’ అని సంపూ అన్నాడు.

ఇంటికి వెళ్లాక తాను త్వరగానే కోలుకుని మామూలు స్థితికి చేరుకున్నానని సంపూ తెలిపాడు. మళ్లీ ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వచ్చి అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు