హాంకాంగ్ లో మన సినిమా దున్నేస్తోందిగా!

హాంకాంగ్ లో మన సినిమా దున్నేస్తోందిగా!

బాలీవుడ్ హీరో మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్...ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌లో న‌టించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటాడు. అమీర్ న‌టించిన దంగ‌ల్ చిత్రం బాలీవుడ్ లో రికార్డు క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే. అదే ఊపులో చైనాలో విడుద‌లైన ఈ సినిమా అనూహ్యంగా భార‌త్ కంటే అధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. చైనాలో ఈ సినిమా దాదాపు 1200 కోట్లు కొల్ల‌గొట్టింది. తాజాగా, హాంకాంగ్ లో కూడా దంగ‌ల్ దూకుడు కొన‌సాగుతోంది. హాంకాంగ్ లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన బాలీవుడ్ సినిమాగా దంగ‌ల్ అవ‌త‌రించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా హాంకాంగ్ లో 23.45 మిలియన్ హాంకాంగ్ డాలర్లు (దాదాపు రూ.19.5 కోట్లు) వసూలు చేసింది.

దంగ‌ల్ సినిమా హాంకాంగ్ బాక్సాఫీస్ ను శాసిస్తోంది. దంగ‌ల్ తో అమీర్ త‌న రికార్డును త‌నే బ‌ద్ద‌లు కొట్టేశాడు. 2009 లో వ‌చ్చిన త్రీ ఇడియట్స్ హాంకాంగ్ లో 23.41 మిలియన్ హాంకాంగ్ డాలర్లు వసూలు చేసింది. తాజాగా, దంగల్ ఆ రికార్డును అధిగమించింది. హాంకాంగ్‌, మకావోలలో క‌లిపి మొత్తం 46 స్క్రీన్లలలో దంగల్‌ విడుదలైంది. హాంకాంగ్ లో విడుద‌ల‌య్యే బాలీవుడ్ సినిమాల స్క్రీన్ల సంఖ్య క‌న్నా దంగ‌ల్ కు నాలుగు రెట్లు అధికంగా కేటాయించామ‌ని డిస్నీ ఇండియా ఉపాధ్యక్షుడు అమృతపాండే చెప్పారు. మంచి క‌థ‌, ఆక‌ట్టుకునే క‌థ‌నం ఉండే సినిమాలు ప్రాంతాల‌తో ప‌నిలేకుండా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతాయ‌ని దంగ‌ల్ మ‌రోసారి నిరూపించింద‌న్నారు.

కాగా, దంగ‌ల్ సినిమా కేవ‌లం విదేశాల్లోనే ఇప్పటివ‌ర‌కు 217.17 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. భారత్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 297.68 మిలియన్ డాలర్లు క‌లెక్ట్ చేసింది. హ‌రియాణా రెజ్ల‌ర్ మహావీర్ సింగ్  ఫోగట్ జీవిత చ‌రిత్ర ఆధారంగా నితీశ్‌ తివారీ ఈ సినిమాను తెర‌కెక్కించారు. గ‌త ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా భారత బాక్సాఫీస్‌ వద్ద 375 కోట్లను కొల్ల‌గొట్టింది. ఈ సినిమాలో అమీర్ న‌ట‌న‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు