ఆ బ్యాడ్ ఫేజ్ గురించి ఎన్టీఆర్..

ఆ బ్యాడ్ ఫేజ్ గురించి ఎన్టీఆర్..

కెరీర్ ఆరంభంలోనే ‘ఆది’.. ‘సింహాద్రి’ లాంటి ఇండస్ట్రీ హిట్లు చూశాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఆ తర్వాత ఆ స్థాయి విజయాల్ని ఇప్పటికీ అందుకోలేదు. మధ్యలో అయితే వరుస ఫ్లాపులతో చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. బ్లాక్ బస్టర్లు.. సూపర్ హిట్లు తర్వాత కనీసం ఓ మోస్తరు విజయాలు కూడా లేని పరిస్థితుల్లో అల్లాడిపోయాడు తారక్.

తన కెరీర్లో అత్యంత పేలవంగా సాగిన ఈ ఫేజ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెనయ్యాడు. చాలా తక్కువ వయసులోనే పెద్ద విజయాలు సాధించడంతో వాటిని హ్యాండిల్ చేయడంలో తాను ఫెయిలయ్యానని ఎన్టీఆర్ చెప్పాడు.

‘‘కెరీర్ ఆరంభంలో చాలా వేగంగా సినిమాలు చేశా. తొలి సినిమా ‘నిన్ను చూడాలని’ ఫ్లాపైనా.. ‘స్టూడెంట్ నెంబర్ వన్’తో సక్సెస్ సాధించాను. ఇంతలోనే ‘ఆది’, ‘సింహాద్రి’ లాంటి బ్లాక్ బస్టర్లు వచ్చాయి. ‘సింహాద్రి’ రిలీజయ్యే సమయానికి నా వయసు 22 ఏళ్లు. ఆ వయసులో అంత పెద్ద సక్సెస్‌ను డీల్ చేయడం ఎవరి వల్లా కాదు. నేను కూడా అంతే. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని పెద్దోళ్లు ఊరికే అనలేదు. నేను నా విజయం గురించి డబ్బా కొట్టేసుకున్నానని కాదు కానీ.. కొంచెం దారి తప్పాను. పూరి జగన్నాథ్ గారు చెప్పిన ఓ డైలాగ్ నాకు చాలా ఇష్టం. మనం ఎవరి చేతుల్లో అయినా మోసపోవచ్చు కానీ.. మన చేతిలో మనం మోసపోకూడదని. అలాగే నా గురించి నేను ఆలోచించుకున్నపుడు తేడా జరుగుతోందని అర్థమైంది. వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నపుడు నేను మునిగిపోతున్న సంగతి నాకు అర్థమవుతూనే ఉంది. కానీ ఏమీ చేయలేకపోయాను. ఫైట్లు చేస్తే వద్దన్నారు. డ్యాన్సులు చేస్తే వద్దన్నారు. ప్రతి ఒక్కరూ నువ్వు ఇలాంటి చేయకూడదు అనేవాళ్లే. కానీ ఏం చేయాలన్నది మాత్రం ఎవరూ చెప్పలేదు. నాకూ అర్థం కాలేదు. ‘రాఖీ’ లాంటి సినిమా చేస్తే అందరూ ప్రశంసించారు. కానీ కలెక్షన్లు రాలేదు. దీంతో ఏం చేయాలో తెలియని అంతర్మథనంలో పడిపోయాను. చివరికి ‘టెంపర్’ మళ్లీ నా కెరీర్‌ను దారిలో పెట్టింది’’ అని ఎన్టీఆర్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English