నిహారిక అతడినెలా ఒప్పుకుందో?

నిహారిక అతడినెలా ఒప్పుకుందో?

మెగా బ్రదర్ నాగబాబు తనయురాలు నిహారిక ఎట్టకేలకు కథానాయికగా తన రెండో సినిమా ఒప్పుకుంది. ‘ఒక మనసు’తో చేదు అనుభవం ఎదుర్కొన్న నిహారిక గత రెండేళ్లలో కొన్ని వేరే అవకాశాలు వచ్చినా ఓకే చేయలేదు. తమిళంలో ఓ సినిమా మాత్రం చేస్తూ.. తెలుగులో మాత్రం ఖాళీగానే ఉండిపోయింది. ఎట్టకేలకు ‘యువి క్రియేషన్స్’ లాంటి పెద్ద బేనర్లో ఆమె కథానాయికగా చేసే అవకాశం దక్కించుకుంది.

లక్ష్మణ్ కార్య అనే కొత్త దర్శకుడు రూపొందించబోయే ఈ చిత్రానికి ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే టైటిల్ కూడా ఖరారు చేసేశారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతుండటం చాలా పెద్ద విశేషమే. మొత్తంగా ఈ కాంబోలో ఒక భారీతనం కనిపిస్తోంది.

ఐతే అన్నీ బాగానే ఉన్నాయి కానీ హీరో విషయంలోనే జనాల్లో అంత ఎగ్జైట్మెంట్ కలగట్లేదు. ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ఇందులో కథానాయకుడిగా నటించబోతున్నాడు. సుమంత్ కెరీర్ ఇప్పుడు ఏ స్థితిలో ఉందన్నది తెలిసిందే. ‘అంతకుముందు ఆ తరువాత’ మినహాయిస్తే అతడి కెరీర్లో హిట్టే లేదు. అందులోనూ గత కొన్నేళ్లలో అతడి నుంచి ‘చక్కిలిగింత’.. ‘కొలంబస్’.. ‘ఫ్యాషన్ డిజైనర్’ లాంటి పేలవమైన సినిమాలొచ్చాయి.

హీరోగా అతను ఏమాత్రం నిలదొక్కుకోలేకపోయాడు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాడు. నిహారిక తొలి సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నాగశౌర్య పక్కన నటించడం పట్ల మెగా అభిమానులు సంతోషించారు. అతడితో ఆమె కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. కానీ సుమంత్ అశ్విన్ పక్కన నిహారిక ఎలా ఉంటుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి ఈ జోడీ ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు