విజయ్‌ని కాపీ కొట్టా-ఎన్టీఆర్

విజయ్‌ని కాపీ కొట్టా-ఎన్టీఆర్

‘జై లవకుశ’ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు భలే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వేరే హీరోల గురించి మాట్లాడటంలో.. వాళ్లకు కాంప్లిమెంట్స్ ఇవ్వడంలో ఎన్టీఆర్ ఏమాత్రం మొహమాట పడట్లేదు. టాలీవుడ్లో తనకు నచ్చిన డ్యాన్సర్ ఎవరంటే.. అల్లు అర్జున్ పేరు ఎన్టీఆర్ చెప్పడం ఆసక్తి రేకెత్తించింది. పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం గురించి స్పందించమంటే.. తాను ఎవరి గురించీ కామెంట్ చేయలేనంటూనే మంచి జరగాలని కోరుకున్నాడు తారక్. అలాగే బాలయ్య సినిమాల్లో నచ్చిన డైలాగ్ చెప్పమంటే.. ‘నరసింహనాయుడు’లోని ‘ప్లేస్ నువ్వు చెప్పినా సరే..’ అనే డైలాగ్ చెప్పి అలరించాడు తారక్.

మరోవైపు తమిళ హీరోల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎన్టీఆర్. తమిళంలో మీకు నచ్చిన హీరోలెవరంటే సూపర్ స్టార్ రజినీకాంత్.. అజిత్‌ల పేర్లు ఎన్టీఆర్ చెప్పడం విశేషం. గతంలోనూ రజినీ మీద తన అభిమానాన్ని చాటుకున్న తారక్.. తాజాగా రజినీని మరోసారి ఆకాశానికెత్తేశాడు. రజినీ స్టైల్ గురించి అందరూ మాట్లాడుతుంటారని.. దాని కంటే కూడా తెరమీద ఆయన కనిపిస్తున్నపుడు ప్రేక్షకుల్లో కనిపించే ఉత్సాహం తనకెంతో ఇష్టమని అన్నాడు.

అజిత్ కూడా తనకు చాలా నచ్చుతాడని చెప్పాడు. మరోవైపు విజయ్ గురించి చెబుతూ.. అతడి డ్యాన్స్ తనకు ఇష్టమన్నాడు. తాను ‘కంత్రి’ సినిమా కోసం విజయ్‌ని కాపీ కొట్టినట్లు ఎన్టీఆర్ చెప్పడం విశేషం. కంత్రిలో వయస్సునామీ పాటలో ఓ స్టెప్.. విజయ్ నటించిన ‘పోకిరి’లోని ఓ పాట నుంచి తీసుకున్నదని ఎన్టీఆర్ వెల్లడించాడు. విజయ్ వేసిన స్టెప్‌ను తాను అనుకరించానని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు