రాజమౌళి మాటల మాంత్రికుడే

రాజమౌళి మాటల మాంత్రికుడే

లాంఛనం ముగిసింది. ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని రాజమౌళి అందుకున్నాడు. ఈ సందర్భంగా ఓవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపించారు. అతడిని ఆకాశానికెత్తేశారు.

రాజమౌళి తెలుగు జాతికి గర్వకారణమని కొనియాడారు. అక్కినేని అవార్డుకు అతను వంద శాతం అర్హుడని తీర్మానించారు. ఐతే రాజమౌళి మాత్రం తాను ఈ అవార్డుకు అర్హుడిని కాదనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ అవార్డు పేరుతో తన భుజాలపై చాలా బరువు పెట్టేశారని.. దాన్ని తాను మోయలేనేమో అని అన్నాడు రాజమౌళి.

ఇక ఏఎన్నార్ గురించి రాజమౌళి తనదైన శైలిలో గొప్పగా మాట్లాడాడు. అక్కినేనిని జక్కన్న భీష్ముడితో పోల్చడం విశేషం. భీష్ముడి లాగే మృత్యువుతో ఏఎన్నార్ సంభాషించాడని.. తాను కోరుకున్న సమయంలో మృత్యు ఒడిలోకి వెళ్లాడని.. వివిధ సమయాల్లో ఆయన మృత్యువును సవాలు చేసి జయించాడని రాజమౌళి అన్నాడు.

70ల్లోనే హార్ట్ అటాక్ వస్తే.. విదేశాల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న ఏఎన్నార్‌కు వైద్యులు 14 ఏళ్ల గడువు ఇచ్చారని.. సరిగ్గా 14 ఏళ్లకు ఆయనకు మళ్లీ ఇబ్బంది తలెత్తిందని.. అక్కడి నుంచి తన సంకల్ప బలంతో ఇంకో 14 ఏళ్లు క్షేమంగా ఉన్నారని.. మళ్లీ తొమ్మిదేళ్ల పాటు వైద్యుల సాయంతో ఆరోగ్యంగా బతికి తాను కోరుకున్నట్లుగా జీవించి.. చివరికి 2011లో ఇక చాలనుకుని మృత్యువును ఆహ్వానించారని.. మొత్తంగా ఒక క్రమ బద్ధమైన జీవితం గడుపుతూనే తాను కోరుకున్న సమయంలో చనిపోయారని.. మహాభారతంలో భీష్ముడి తర్వాత కలియుగంలో ఇలా మృత్యువుతో సంభాషించిన వ్యక్తి ఏఎన్నార్ మాత్రమే అని.. అలాంటి గొప్ప వ్యక్తి పేరిట నెలకొల్పిన అవార్డుకు తాను తగిన వాడిని కాదేమో అని అన్నాడు జక్కన్న.

ఐతే తాను ఇంకా కష్టపడాలని.. స్ట్రగులవ్వాలని చెబుతూ ఈ అవార్డు తనకు ఇచ్చారని భావిస్తున్నట్లు రాజమౌళి చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు