విశాల్ అంత చేసినా ఆగలేదు

విశాల్ అంత చేసినా ఆగలేదు

తమిళనాట పైరసీకి అడ్డు కట్ట వేసేందుకు కొన్నేళ్లుగా పోరాడుతున్నాడు హీరో విశాల్. ఇందుకోసం పైరసీ దుకాణాల మీద స్వయంగా అటాక్ కూడా చేశాడు. కానీ ఏం ప్రయోజనం? ఏమీ మార్పు లేదు. పైరసీ రోజు రోజుకూ అక్కడ మరింత విస్తృతం అవుతోంది. ఐతే ఈ ఏడాది ఆరంభంలో నిర్మాతల మండలి అధ్యక్షుడయ్యాక.. పైరసీ వెబ్ సైట్ల భరతం పడతానంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరిన విశాల్.. ఆ దిశగా ఒక ఆపరేషన్ కూడా మొదలుపెట్టాడు. తన టీంతో కలిసి ఒక పైరసీ వెబ్ సైట్ అడ్మిన్‌ చుట్టూ ఉచ్చు బిగించి పోలీసులకు చిక్కేలా చేశాడు.

ఈ పరిణామం సరిగ్గా విశాల్ కొత్త సినిమా ‘తుప్పారివాలన్’ విడుదలకు ముందు జరగడంతో పైరసీ వెబ్ సైట్ల యాజమాన్యాల్లో దడ పుట్టి ఉంటుందని అంతా అనుకున్నారు. మరోవైపు విశాల్ అభిమానులు ‘తుప్పారివాలన్’ థియేటర్లలో నిఘా పెట్టారు కూడా. ఇంత జరిగినా విశాల్ అండ్ టీం పైరసీని మాత్రం ఆపలేకపోయింది.

ఇంతకుముందు సూర్య సినిమా ‘సింగం-3’ విడుదల రోజు ఉదయం 11 గంటలకే పైరసీ ప్రింట్ పెడతామంటూ ప్రకటన చేసిన సంచలనం సృష్టించిన ‘తమిళ్ రాకర్స్’ వెబ్ సైట్.. ఇప్పుడు విశాల్ సినిమా పైరసీ ప్రింట్ స్ట్రీమ్ చేసింది. ఇంతకుముందు పైరసీ మీద యుద్ధం ప్రకటించినపుడు ఈ సైట్ పేరే చెప్పాడు విశాల్. కానీ ఇప్పుడు ఆ వెబ్ సైటే ‘తుప్పారివాలన్’ పైరసీ ప్రింట్ షేర్ చేసి అతడికి చెక్ పెట్టింది.

ఓ వెబ్ సైట్ ఇలా అందరి నోళ్లలో నానుతూ.. తమిళ సినీ పరిశ్రమ మొత్తం దానికి వ్యతిరేకంగా నిలబడ్డా కూడా దాన్ని ఏమీ చేయలేకపోవడం విడ్డూరమే. అంతమంది సెలబ్రెటీలు కలిసి ఈ వెబ్ సైట్లను ఎందుకు బ్లాక్ చేయించలేకపోతున్నారో ఏంటో మరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English